Air traffic: విమాన ప్రయాణాల్లో బిగ్‌ జంప్‌.. విమాన సంస్థల్లో ఇండిగోనే టాప్‌

Air traffic data: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క మార్చి నెలలో కోటీ 28 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఈ మేరకు డీజీసీఏ డేటాను వెలువరించింది.

Published : 19 Apr 2023 15:47 IST

దిల్లీ: దేశీయ విమానయాన రంగం పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటోంది. కొవిడ్‌ సమయంలో అతలాకుతలం అయిన ఈ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయంగా ఏకంగా 3.75 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. గతేడాది ఇదే సమయంలో 2.47 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 51.7 శాతం మేర పెరగడం గమనార్హం. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) డేటాను విడుదల చేసింది. ఒక్క మార్చిలోనే 128.93 లక్షల మంది (1.28 కోట్లు) ప్రయాణాలు చేసినట్లు పేర్కొంది. గతేడాది మార్చిలో ఈ సంఖ్య 106.19 లక్షలుగా ఉంది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో ప్రయాణికుల సంఖ్య 21.41 శాతం మేర పెరగడం గమనార్హం.

మార్కెట్‌ వాటా పరంగా దేశీయ అతిపెద్ద ఎయిర్‌లైన్‌ సంస్థ ఇండిగో (Indigo) మార్చి అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం ప్రయాణికుల్లో 56.8 శాతం వాటా ఇండిగోదే. మార్చి నెలలో మొత్తం 73.17 లక్షల మంది ఇండిగో విమానాల్లో ప్రయాణించారు. ఈ విషయంలో 8.9 శాతం మార్కెట్‌ వాటాతో విస్తారా (11.49) రెండో స్థానంలో నిలిచింది. ఎయిరిండియా 8.8 శాతం వాటా (11.39 లక్షలు)తో మూడో స్థానంలో నిలిచింది. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించి ఆకాశ ఎయిర్‌ మార్కెట్‌ వాటా మునుపటి నెలతో పోలిస్తే 30 బేసిస్‌ పాయింట్లు పెరిగిందని డీజీసీఏ తెలిపింది. అదే సమయంలో స్పైస్‌జెట్‌ మార్కెట్‌ వాటా 70 పాయింట్లు, గో ఫస్ట్‌ విమానాల మార్కెట్‌ వాటా 100 బేఏసిస్‌ పాయింట్లు తగ్గడం గమనార్హం.

ఇక పాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (ఆక్యుపెన్సీ) విషయాన్ని పరిశీలిస్తే.. స్పైస్‌జెట్‌ ఈ విషయంలో 92.3 శాతంతో ముందు వరుసలో ఉంది. 91.6 శాతంతో విస్తారా, 90.2 శాతంతో గోఫస్ట్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చినెలలో క్యాన్సిలేషన్‌ రేటు సైతం 0.28 శాతంగా ఉందని డీజీసీఏ వెల్లడించింది. మొత్తం 347 మంది ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందగా.. అత్యధికంగా ఇండియా వన్‌ఎయిర్‌ మీదే రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు