Life Insurance: జీవిత బీమా తీసుకునేటప్పుడు ఈ త‌ప్పులు చేయొద్దు!

బీమాను పెట్టుబ‌డుల కోణంలో చూడొద్దు. ఆధారిత కుటుంబ స‌భ్యులు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ట‌ర్మ్ ప్లాన్ త‌ప్ప‌నిస‌రిగా కొనుగోలు చేయాలి.

Updated : 07 Jan 2022 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా.. మీరు లేని స‌మ‌యంలో మీపై ఆధార‌ప‌డిన వారికి ఆర్థికంగా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. అందువ‌ల్ల కొనుగోలు స‌మ‌యంలో ఎలాంటి త‌ప్పులు జ‌రగకుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. మీరు చేసే చిన్న చిన్న పొర‌పాట్లే మీ కుటుంబ స‌భ్యులకు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు అంద‌కుండా చేయొచ్చు. అందుకే జీవిత బీమా విష‌యంలో త‌ప్పులు నివారించాలి. సాధారణంగా బీమా కొనుగోలు సమయంలో చేసే తప్పులను ఇప్పుడు తెలుసుకుందాం..

ట‌ర్మ్ బీమా కొనుగోలు చేయ‌క‌పోవ‌డం: బీమాను పెట్టుబ‌డుల కోణంలోనే చూస్తున్నారు చాలామంది. చెల్లించిన ప్రీమియంపైనా రాబ‌డి పొందాల‌ని ఆశించి.. పెట్టుబ‌డుల‌తో అనుసంధాన‌మైన పాల‌సీల‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇక్క‌డో విషయం గుర్తుంచుకోవాలి. బీమా, పెట్టుబ‌డులు రెండు వేర్వేరు. రెండింటినీ కలపడం వల్ల ప్ర‌యోజ‌నం మాట పక్కన పెడితే న‌ష్ట‌పోయే అవ‌కాశ‌మే ఎక్కువ‌.

విద్య‌, ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి ల‌క్ష్యాల‌తో పెట్టుబ‌డులు ముడిప‌డి ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని మించి స‌రైన స‌మ‌యానికి కార్ప‌స్ పోగుచేయాల్సి ఉంటుంది. పెట్టుబ‌డి అనుసంధానిత బీమా ప‌థ‌కాలు ద్రవ్యోల్బణాన్ని అధిగ‌మించి రాబ‌డి అందించలేవు. అంతేకాదు వీటికి చెల్లించే ప్రీమియం కూడా అధికంగా ఉంటుంది. ట‌ర్మ్ ప్లాన్‌కి చెల్లించే ప్రీమియం కంటే ఇత‌ర పాల‌సీల‌కు 10 నుంచి 15 రెట్లు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. ప్యూర్ ట‌ర్మ్ ప్లాన్‌లో పాల‌సీదారుడు పాలసీ కాల‌వ్య‌వ‌ధిలో మ‌ర‌ణించిన‌ప్పుడు మాత్ర‌మే హామీ మొత్తం కుటుంబ స‌భ్యుల‌కు అందుతుంది. అందుకే ప్రీమియం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఒక ట‌ర్మ్ ప్లాన్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని మీ ఆర్థిక ల‌క్ష్యానికి అనుగుణంగా మ‌దుపు చేస్తే, పెట్టుబ‌డుల‌ నుంచి మంచి రాబ‌డి సాధించ‌గ‌లుగుతారు. అలాగే త‌గిన క‌వ‌రేజ్‌ను పొంద‌గ‌లుగుతారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా హామీ పొందడం టర్మ్ ప్లాన్‌తో మాత్రమే సాధ్యం.

ఆల్ ఇన్ వన్ సొల్యూషన్‌గా భావించ‌డం: జీవిత బీమా అనేది దీర్ఘకాలిక పరిష్కారం. పాలసీదారులు త‌మ‌పై ఆధారపడిన వారి కోసం మాత్ర‌మే దీన్ని కొనుగోలు చేయాలి. ఇదే జీవిత బీమా స్పష్టమైన ప్రయోజనం. కానీ ఈ సంతృప్తి లేకపోవడం వల్ల జీవిత బీమా నుంచి మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను ఆశించి, త‌మ‌కు స‌రిపోని పాల‌సీల‌ను కొనుగోలు చేసి న‌ష్ట‌పోతున్నారు. కాబ‌ట్టి ఆల్ ఇన్ వ‌న్ సొల్యూష‌న్‌గా జీవిత బీమాను చూడ‌కండి. భ‌విష్య‌త్‌లో కుటుంబ స‌భ్యుల అవ‌స‌రాలు తీర్చ‌డం.. ఇప్పుడున్న జీవన ప్ర‌మాణాల‌తో జీవించేందుకు కావల‌సిన మొత్తాన్ని వారికి అందించ‌డ‌మే జీవిత బీమా అస‌లు ల‌క్ష్య‌మ‌ని గుర్తించండి.

పూర్తి స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం: జీవిత బీమా తీసుకునే వారిలో చాలా మంది చేసే త‌ప్పుల్లో ఇదీ ఒక‌టి. ప్రీమియం త‌గ్గించుకునేందుకు కొన్ని విష‌యాలు దాచిపెడతారు. చిన్న చిన్న విష‌యాలే క‌దా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇటువంటి చిన్న త‌ప్పులు, పొర‌పాట్లే క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌కు కార‌ణం అవుతాయి. బీమా కొనుగోలు ఉద్దేశాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అందువ‌ల్ల బీమా కొనుగోలు స‌మ‌యంలో మీ పూర్తి వివ‌రాల‌ను తెలియ‌జేయండి. మీ అలవాట్ల‌ను చెప్పండి. ఎలాంటి స‌మాచారాన్ని దాచిపెట్టొద్దు. అన్ని విషయాలూ సరిగ్గా ఉంటే.. క్లెయిమ్ తిరస్కరించే హక్కు బీమా కంపెనీకి ఉండదు. ఒకవేళ తిరస్కరించినా, మీ కుటుంబం ఐఆర్డీఏ లేదా బీమా అంబుడ్స్‌మన్‌ను సంప్రదించొచ్చు.

కుటుంబ స‌భ్యుల‌కు తెలియప‌ర‌చ‌క‌పోవ‌టం: మీ ఆర్థిక విష‌యాల‌ను కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేయ‌క‌పోవ‌డం అన్నింటికంటే పెద్ద త‌ప్పు. మీ పాలసీ వివరాల గురించి మీపై ఆధారపడిన వారికి తెలియకపోతే జీవిత బీమాను కొనుగోలు చేయడం వెనుక ఉన్న‌ ప్రధాన ఉద్దేశం నెరవేరదు. పాల‌సీ ఉన్న‌ట్లు తెలియ‌క‌పోతే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వారు క్లెయిమ్ చేయ‌లేరు. అందువ‌ల్ల కొనుగోలు గురించి ఒక‌రిద్ద‌రికైనా తెలియ‌జేయండి. ప‌త్రాల‌ను ఎక్క‌డ దాచిపెడుతున్నారో కూడా తెల‌పండి.

పాల‌సీని స‌మీక్షించ‌క‌పోవ‌డం: జీవిత బీమాను కొనుగోలు చేశాం కదా అని అక్క‌డితో దాన్ని పక్కన పెట్టేస్తారు కొందరు. ముందే చెప్పుకున్న‌ట్లు జీవిత బీమా అనేది దీర్ఘ‌కాలిక ప‌రిష్కారం. కొనుగోలు చేస్తే స‌రిపోదు. దాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తుండాలి. వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు మీ జీవ‌నశైలికి, అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పాల‌సీ క‌వ‌రేజ్‌ను పెంచుకుంటూ ఉండాలి. కాబట్టి, సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా మీ లైఫ్ కవర్‌ని సమీక్షించడం అవ‌స‌రం.

ఇత‌ర పెట్టుబ‌డి ప‌థకాలతో పోల్చడం: కొంద‌రు బీమా పాల‌సీల‌ను ఇత‌ర ఆర్థిక ఉత్ప‌త్తుల‌తో పోల్చుతుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఎఫ్‌డీల‌ను, బీమా ప్లాన్‌ల‌తో పోల్చుతుంటారు. ఎఫ్‌డీ, బీమా ప్ర‌యోజ‌నాలు వేరువేరు అని గుర్తించాలి. ఒక‌దానితో వేరొక‌దాన్ని పోల్చకూడ‌దు. అలాగే బీమా కోస‌మే ఎఫ్‌డీ చేయ‌డం వంటివీ చేయ‌కూడ‌దు. ఎందుకంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో సంస్థ‌లు అందించే బీమా హామీ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఇది మీ కుటుంబ స‌భ్యుల ఆర్థిక అవ‌స‌రాల‌కు ఏ మాత్రం స‌రిపోదు. అంతేకాకుండా ఆ ఎఫ్‌డీ కాల‌ప‌రిమితి వ‌ర‌కే బీమా ఉంటుంది. ఆ తర్వాత ర‌ద్ద‌వుతుంది. ప్ర‌త్యేకంగా బీమా ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని