ITR: ఉద్యోగం మారారా? ఐటీఆర్‌ దాఖలులో ఇవి మర్చిపోవద్దు!

ITR: ఉద్యోగులు ఐటీఆర్‌ సమర్పించాలంటే ఫారం 16 చాలా అవసరం. అయితే, ఒకే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారినప్పుడు రెండు ఫారం 16లు ఉంటాయి. అలాంటప్పుడు వివరాలేవీ రిపీట్‌ కాకుండా ఐటీఆర్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Published : 31 May 2023 11:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు (Income Tax Returns- ITR) సమయం దగ్గరపడుతోంది. వచ్చే కొన్ని రోజుల పాటు ఉద్యోగులంతా దీనిపైనే దృష్టి పెడతారు. యాజమాన్యాలు జారీ చేసే ఫారం 16 కోసం వేచి చూస్తుంటారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఫారం 16ను ఉద్యోగులకు అందజేశాయి. ఈ ఫారంలో వేతన ఆదాయం, పన్ను కోతలు, మినహాయింపుల వంటి వివరాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐటీఆర్‌ (ITR) దాఖలు చేయడానికి ఈ ఫారం చాలా ముఖ్యం.

యాజమాన్యాలు వాస్తవానికి జూన్‌ 15 నాటికి ఈ ఫారం 16ను (Form 16) ఉద్యోగులకు అందజేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారం 16ను 2023 జూన్‌ 15 నాటికి ఉద్యోగులకు ఇవ్వాలి. ఈ ఫారంలో రెండు భాగాలుంటాయి. మొదటి దాంట్లో పన్ను చెల్లింపుదారుడు, యాజమాన్యాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. సర్వీస్‌ పీరియడ్‌, పన్ను కోత (Tax Deduction) వంటి వివరాలు కూడా ఇందులోనే ఇస్తారు. రెండో భాగంలో యాజమాన్యం చేసిన పన్ను మదింపునకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తారు.

ఇవన్నీ చెక్‌ చేయాలి..

ఫారం 16 (Form 16) తీసుకోగానే ఉద్యోగులు వాటిని క్షుణ్నంగా పరిశీలించాలి. పాన్‌ (PAN) వంటి వివరాలు సరిగా ఉన్నాయో.. లేదో చూడాలి. ఒకవేళ పొరపాటున పాన్‌ తప్పుగా పడితే.. పన్ను కోత (Tax Deduction) వివరాలు మీ ఖాతాలోకి రావు. అలాంటప్పుడు వాటిని క్లెయిం చేయడం సాధ్యం కాదు. తర్వాత ఫారం 16 (Form 16)లో పూర్తిగా అన్ని వివరాలను ఇచ్చారో.. లేదో కూడా చెక్‌ చేసుకోవాలి. పన్ను కోత (Tax Deduction) వివరాలన్నీ అందులో ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి. ఫారం 16లోని టీడీఎస్ (TDS) వివరాలు ఫారం 26ఏఎస్‌ వివరాలతో సరిపోలాలి. పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను కూడా చెక్‌ చేసుకోవాలి. అలాగే యాజమాన్యాల TAN కూడా సరిగా మెన్షన్‌ చేసేలా చూసుకోవాలి.

ఒకవేళ ఫారంలో ఏవైనా తప్పులు దొర్లితే వెంటనే కంపెనీ యాజమాన్యాలను సంప్రదించి సరిచేయించుకోవాలి. వారు తప్పులను సరిచేసి రివైజ్డ్‌ టీడీఎస్‌ రిటర్నులను దాఖలు చేస్తారు. అలాగే ఫారం 16 (Form 16)లో లేని పన్ను కోతలు, మినహాయింపులను కావాలంటే ఉద్యోగులు ఐటీఆర్‌ (ITR)లో ప్రత్యేకంగా క్లెయిం చేసుకునే వీలుంటుంది.

ఉద్యోగం మారితే..

ఒకవేళ ఉద్యోగులు ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారారనుకుందాం. అలాంటప్పుడు వారికి రెండు ఫారం 16లు ఉంటాయి. ఒకటి ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ జారీ చేస్తే.. మరొకటి గతంలో పనిచేసిన కంపెనీ ఇస్తుంది. అలాంటప్పుడు పాత కంపెనీ నుంచి వచ్చిన ఆదాయ వివరాలను ఫారం 12బి ద్వారా కొత్త కంపెనీకి తెలియజేయాలి. తద్వారా కొత్త యాజమాన్యం ఆ వివరాలను తమ ఫారం 16లో పొందుపర్చగలుగుతుంది. ఫలితంగా ఒకే ఆదాయం/పన్ను కోత/పన్ను మినహాయింపు/క్లెయిం రెండు సార్లు రిపీట్‌ కాకుండా ఉంటాయి.

చివరగా.. మనం సమర్పించిన ఐటీఆర్‌ (ITR)లోని వివరాలను సపోర్ట్ చేసే ప్రతి డాక్యుమెంట్‌ మన దగ్గర ఉండాలి. ఫారం 16, ఫారం 12బి వంటి పత్రాలన్నీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో రుజువు చేయగలిగే పత్రాలూ ఉండాలి. పన్ను కోత, క్లెయిం, మినహాయింపులకు సంబంధించిన డాక్యుమెంట్లూ ఉండాలి. ఒకవేళ ఆదాయ పన్ను విభాగం ఏదైనా కారణంతో ఆడిట్‌ చేసినా.. నోటీసులు పంపినా ఈ పత్రాలన్నీ ఉపయోగపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని