Investment Tips: పెట్టుబడులప్పుడు చేయకూడని ఐదు తప్పులు!

భవిష్యత్‌ అవసరాలు తీరాలన్నా.. ఆర్థిక భద్రత కావాలన్నా మదుపు చేయడం తప్పనిసరి. అందుకోసం మనకొచ్చే రాబడిని పెట్టుబడి పెడుతుంటాం.

Updated : 27 Oct 2021 14:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్‌ అవసరాలు తీరాలన్నా.. ఆర్థిక భద్రత కావాలన్నా మదుపు చేయడం తప్పనిసరి. అందుకోసం మనకొచ్చే రాబడిని పెట్టుబడి పెడుతుంటాం. ఈ విషయంలో కొందరు వారికి తోచిన విధంగా ముందుకెళ్తుంటారు. మరికొందరు తోటివారి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు. దీర్ఘకాలంలో మన సొమ్ముకు చక్కటి రాబడి రావాలంటే ఈ రెండు నిర్ణయాలూ తప్పే అంటున్నారు నిపుణులు. చాలామంది ఇలాంటి తప్పులు చేస్తుంటారు. వాటిని పరిహరిస్తే మన పెట్టుబడికి తగ్గ ఫలితం ఉంటుంది. 

* చాలామంది ఏదైనా ఒక ఫండ్‌లో పెట్టుబడులు పెడతారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆ ఫండ్‌ విషయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. దీంతో ఆ ఫండ్‌ను నిలిపివేయాలని అనుకుంటారు. అంతేకాదు, అదే ఫండ్‌ హౌస్‌లో మదుపు చేసిన మిగిలిన వాటినీ నిలిపేయాలని భావిస్తుంటారు. తనకు ఒక ఫండ్‌ విషయంలో ఉన్న కోపాన్ని ఫండ్‌ హౌస్‌ మీద చూపించి, మిగిలిన ఫండ్లు నిలిపివేయడం మదుపరులకే నష్టమని చెబుతున్నారు నిపుణులు. 

* మదుపు చేసే విషయంలో తోటివారిని అనుకరించడం ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. వ్యక్తి ఫలానా దాంట్లో పెట్టుబడి పెట్టి గరిష్ఠ లాభాలు పొందాడు కదా అని అందులోనే పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకున్నవాళ్లు కూడా ఉన్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిపుణుల సలహాలతో పెట్టుబడుల విషయంలో ముందుకెళ్లాలి.

* మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు కొత్త ఫండ్లు కనిపించగానే కొందరు వాటికి మారిపోతుంటారు. కొందరు తరచూ ఈ విధంగా చేస్తుంటారు. కొత్త ఫండ్లకు మారేటప్పుడు అందులో వచ్చే లాభాన్ని అంచనా వేయడానికి ముందు, అలా మారే ప్రతిసారీ చెల్లించే ఫీజులు, ఇతర ట్యాక్సులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

* మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడితో ఏడాదికే ఇంత మొత్తంలో రాబడి వచ్చిందంటూ కొన్ని ప్రకటనలు కనిపిస్తుంటాయి. వాటిని నమ్మడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెబుతారు నిపుణులు. దీర్ఘకాలంలో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్లడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నారు.

* ఒక ఫండ్‌లో మదుపు చేసేటప్పుడు కేవలం ఒక్కరి అనుభవాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రాకూడదు. ఫలానా తేదీన, ఫలానా ఏడాది ఆ వ్యక్తి పెట్టుబడి పెట్టి మంచి లాభాలనో, నష్టాలనో పొంది ఉండొచ్చు. ఈ విషయంలో మదుపరుల సగటు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావాలంటారు నిపుణులు. అలాగే మదుపు చేసేటప్పుడు గతాన్ని కాకుండా భవిష్యత్తును అంచనా వేయాలని సూచిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని