ఈ అయిదు విష‌యాలు ఎవ్వ‌రితో పంచుకోకండి

ఈ అయిదు ఆర్థిక విష‌యాల‌ను ఎవ్వ‌రితోనూ పంచుకోకపోవ‌డ‌మే మంచిది. ఎవ‌రైనా ఈ వివ‌రాలు అడిగితే అనుమానించాల్సిందే..

Published : 15 Dec 2020 20:15 IST

పంచుకుంటేనే ఆనందం… షేరింగ్ ఈజ్ కేరింగ్ అనే మాట‌లు త‌ర‌చూ మ‌న సంభాష‌ణ‌ల్లో వ‌స్తుంటాయి. ముఖ్యంగా పిల్ల‌ల‌తో స‌మ‌యాన్ని గ‌డిపేట‌ప్పుడు షేరింగ్ అనే ప‌దాన్ని ఎక్కువ సార్లు వ‌ల్లిస్తుంటాం. క‌లిసి భోజ‌నం చేసేట‌ప్పుడో, క‌లిసి ఆడుకునేట‌ప్పుడో ఇత‌రుల‌తో భోజ‌నాన్ని, బొమ్మ‌ల‌ను పంచుకోమ‌ని ప‌దే ప‌దే పిల్ల‌ల‌ను ప్రోత్స‌హిస్తాం.

పంచుకోవ‌డం వ‌ల్ల ఆనందం ద్విగుణీకృత‌మ‌వుతుంద‌ని ఇత‌రుల‌కు చెబుతుంటాం. మ‌న‌మూ పాటించేందుకు చూస్తుంటాం. చాలా విష‌యాల్లో ఈ ప‌ద్ధ‌తిని పాటించ‌డం బాగానే ఉన్నా… ఆర్థిక విష‌యాల‌కు సంబంధించి కొంత స‌మాచారాన్ని ఎవ్వ‌రితోనూ పంచుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

ఈ అయిదు ఆర్థిక విష‌యాల‌ను మాత్రం ఎవ్వ‌రితోనూ పంచుకోకపోవ‌డం మంచిది.

కార్డు వివ‌రాలు

ఎక్స్‌పైరీ తేదీ, కార్డు సంఖ్య‌, పూర్తి పేరు త‌దిత‌ర వివ‌రాలు క్రెడిట్‌, డెబిట్ కార్డుపై ముద్రించి ఉంటాయి. మీ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కార్డుపై ఉన్న ఇత‌ర స‌మాచారాన్ని ఎవ్వ‌రితోనూ పంచుకోవ‌ద్దు. కార్డుపై ముద్రించి ఉన్న స‌మాచారం మీ కోసమే త‌ప్ప ఇత‌రుల‌తో పంచుకునేందుకు కాద‌ని గుర్తుంచుకోవాలి. ఈ వివ‌రాలు ఆన్‌లైన్ లావాదేవీలు జ‌రిపేందుకు ఉప‌యోగప‌డ‌తాయి. ఈ స‌మాచారమంతా మొద‌టి అంచె భ‌ధ్ర‌త కోసం రూపొందించారు. ఈ స‌మాచారం తెలియ‌కుండా కార్డును దుర్వినియోగం చేయ‌డం క‌ష్టం. కాబ‌ట్టి అప‌రిచిత వ్య‌క్తుల‌కు కార్డు వివ‌రాలు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.

సీవీవీ

దాదాపు అన్ని డెబిట్‌, క్రెడిట్ కార్డుల వెన‌క భాగాన సీవీవీ సంఖ్య ఉంటుంది. సీవీవీ అంటే కార్డ్ వెరిఫికేష‌న్ వాల్యూ. ఆన్‌లైన్ లావాదేవీలు పూర్తిచేసేందుకు సీవీవీ సంఖ్య చాలా ముఖ్యం. సీవీవీ సంఖ్య కూడా స్ప‌ష్టంగా కార్డుపై ముద్రించి ఉంటుంది. ఈ సంఖ్య‌ను ఎవ్వ‌రితోనూ పంచుకోవ‌ద్దు.

పాస్‌వ‌ర్డ్‌లు

ఆన్‌లైన్ లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డును ఉప‌యోగించేట‌ట్ల‌యితే… క‌స్ట‌మ‌ర్ ఐడెంటిఫికేష‌న్ నంబ‌ర్‌(సీఐఎన్‌), కార్డు వివ‌రాలు, పాస్‌వ‌ర్డ్ లాంటి గోప్య‌త క‌లిగిన వివ‌రాలు లేనిదే లావాదేవీ పూర్త‌వ్వ‌ద‌నే సంగ‌తి మీకు తెలుసు. కార్డుపై ఉండే వివ‌రాలు ఏదో విధంగా ఇత‌రుల‌కు తెలిసినా… పాస్‌వ‌ర్డ్ మాత్రం మీ ఆధీనంలోనే ఉంటుంది. ఇది ఎవ్వ‌రికీ చెప్ప‌కూడ‌దు. త‌ర‌చూ పాస్‌వ‌ర్డ్‌ను మార్చుకుంటూ ఉండ‌డం మంచిది.

పిన్‌

క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌ వ్య‌క్తిగ‌త గుర్తింపు సంఖ్య‌(పిన్‌) స‌హాయంతో ఏటీఎమ్ వ‌ద్ద డ‌బ్బు విత్ డ్రా చేసుకునేందుకు ఉప‌యోగిస్తాం. ఇది కాకుండా షాపుల వ‌ద్ద స్వైపింగ్ మిష‌న్ల‌పై పిన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేస్తేగానీ లావాదేవీ పూర్తి అవ్వ‌దు. పిన్ నెంబ‌రు అనేది ర‌హ‌స్య సంఖ్య‌. పిన్ నెంబ‌రును ఎవ్వ‌రికీ చెప్ప‌కూడ‌దు. ఏటీఎమ్‌ల వ‌ద్ద‌, స్వైపింగ్ మిష‌న్ల వ‌ద్ద పిన్ సంఖ్య‌ను న‌మోదు చేసేట‌ప్పుడు మీ ప‌క్క‌న ఉన్న‌వారు గ‌మ‌నించ‌కుండా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డగ‌ల‌రు.

ఓటీపీ

ఆన్‌లైన్ లావాదేవీ జ‌రిపేట‌ప్పుడు రెండో అంచె భ‌ద్ర‌త‌ను వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌(ఓటీపీ) క‌ల్పిస్తుంది. కార్డు, నెట్‌బ్యాంకింగ్‌, ఇ-వ్యాలెట్ ఉప‌యోగించి ఏదైనా కొనుగోలు చేయ‌ద‌లిస్తే … రిజిస్ట‌ర్ అయిన మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. లావాదేవీని ధ్రువీక‌రించేందుకు ఇదే చిట్ట‌చివ‌రి ద‌శ‌. ఇత‌ర భ‌ద్ర‌తాప‌ర‌మైన అంశాల‌న్నీ పూర్తిచేశాకే ఓటీపీ మొబైల్ నంబ‌రుకు చేరుతుంది. కాబ‌ట్టి ఓటీపీని ఎవ్వ‌రితోనూ పంచుకోవ‌ద్దు. ఓటీపీ కొన్ని నిమిషాల్లోనే ఉప‌యోగించ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత దాన్ని ప్ర‌యోగించినా ఫ‌లితం ఉండ‌దు. ఇలాంటి కీల‌క‌ స‌మాచారాన్ని ఇత‌రులు త‌స్క‌రించ‌కుండా ఉండేందుకు ఓటీపీ చివ‌రి ఆయుధం. కాబ‌ట్టి ఎవ్వ‌రితోనూ ఓటీపీని పంచుకోవ‌ద్దు.

ఎవ‌రైనా ఈ వివ‌రాలు అడిగితే అనుమానించాల్సిందే. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇలాంటి గోప్య‌త క‌లిగిన వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని అడ‌గ‌వు.

సంబంధిత క‌థ‌నాలు

సుర‌క్షితంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్

ఏటీఎమ్‌లో ఏమ‌ర‌పాటు వ‌ద్దు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని