5G Network: విమానాశ్రయాల్లో హైఫ్రీక్వెన్సీ 5జీ సేవలకు DOT నో!

విమానాశ్రయాల్లో హై-ఫ్రీక్వెన్సీ 5జీ సేవలను నిలిపివేయాలని టెలికాం విభాగం మొబైల్ నెట్‌వర్క్‌ సంస్థలకు సూచించింది. విమాశ్రయం నుంచి రెండు కిలోమీటర్ల పరిధి వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది. 

Published : 01 Dec 2022 00:03 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ సేవలు ఇప్పటికే పలు నగరాల్లో, కొన్ని విమానాశ్రయాల్లో అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు టెలికాం సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికాం విభాగం మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలకు కీలక సూచన చేసింది. విమానాశ్రయాలు, పరిసర ప్రాంతాల్లో హైఫ్రీక్వెన్సీ 5జీ సేవలను నిలిపివేయాలని సూచించింది. డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 3.3-3.6 గిగాహెర్జ్‌ సామర్థ్యం కలిగిన 5జీ నెట్‌వర్క్‌ సేవలను విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల పరిధి వరకు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిబంధన తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది.

ప్రస్తుతం ఎయిర్‌టెల్ సంస్థ మాత్రమే పట్నా, బెంగళూరు, పుణే, వారణాశి, నాగ్‌పూర్‌ నగరాల్లోని విమానాశ్రయాల్లో 5జీ సేవలను అందిస్తోంది. తాజా నిర్ణయంతో ఈ సేవలు నిలిచిపోనున్నాయి. విమానశ్రయ పరిసర ప్రాంతాల్లో 5జీ సిగ్నల్స్‌ పైలట్‌ విమానం ఎత్తును నియత్రించే అల్టీమీటర్‌ అనే పరికరం సిగ్నల్స్‌ను అడ్డుకుంటున్న కారణంగా డీజీసీఏ టెలికాం విభాగానికి ఈ సూచన చేసింది. అయితే, ఈ నిబంధన తాత్కాలికమేనని, అల్టీమీటర్‌కు ప్రత్యామ్నాయంగా మరో వ్యవస్థను ఏర్పాటు చేసిన అనంతరం 5జీ సేవలకు అనుమతి లభిస్తుందని తెలిపింది.  ఇది ఎప్పటిలోగా సాధ్యపడుతుందనే దానిపై స్పష్టతనివ్వలేదు. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని