Twitter Takeover: అది తేల్చే వరకు ట్విటర్‌ డీల్‌ ముందుకెళ్లదు: మస్క్‌

ట్విటర్‌ కొనుగోలు (Twitter Takeover)కు ఒప్పందం ఖరారు చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నకిలీ ఖాతాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు....

Published : 17 May 2022 18:25 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ కొనుగోలు (Twitter Takeover)కు ఒప్పందం ఖరారు చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నకిలీ ఖాతాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లదని స్పష్టం చేశారు. ట్విటర్‌లో ఓ యూజర్‌కు బదులిస్తూ ఆయన మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ట్విటర్‌ 5 శాతం కంటే తక్కువ నకిలీ ఖాతాలు ఉన్నట్లు చెబుతోంది. కానీ, అవి వారు చెబుతున్న దానికంటే నాలుగింతలు అధికమని తెలుస్తోంది. ఇది చాలా ఎక్కువ. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ట్విటర్‌ ఇచ్చిన సమాచారం కచ్చితమైనదని భావించే నేను కొనుగోలు ఒప్పందానికి అంగీకరించాను. ఐదు శాతం మాత్రమే నకిలీ ఖాతాలున్నాయని రుజువు చేయడానికి సీఈఓ నిన్న బహిరంగంగా నిరాకరించారు. ఆయన దాన్ని నిరూపించే వరకు ఈ డీల్‌ ముందు వెళ్లదు’’ అని మస్క్‌ ట్విటర్‌లో స్పష్టం చేశారు.

అంతకుముందు ఒక్కో ట్విటర్‌ (Twitter) షేరు కొనుగోలుకు తాను ఆఫర్‌ చేసిన 54.20 డాలర్ల ధరను తగ్గించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని మస్క్‌ చెప్పారు. అంటే ఆయన ఒప్పుకున్న 44 బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ చెల్లించి ట్విటర్‌ను కొనుగోలు (Twitter Takeover) చేయాలనుకుంటున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేసే ప్రణాళికను ‘తాత్కాలికంగా నిలిపివేసిన’ట్లు మస్క్‌ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ట్విటర్‌లో స్పామ్‌, నకిలీ ఖాతాల సంఖ్య కచ్చితంగా ఎంత ఉందన్న విషయాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా అవి తేలే వరకు డీల్‌ ముందుకు వెళ్లదని తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేస్తారా? అనే విషయంపై వాణిజ్య వర్గాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని