హాలిడే రోజు పనిచెప్తే ₹ లక్ష జరిమానా.. భారతీయ కంపెనీ కొత్త పాలసీ!

సెలవులో ఉన్న ఉద్యోగిని పని పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు డ్రీమ్‌ 11 కంపెనీ కొత్త పాలసీని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హాలిడే రోజున ఉద్యోగికి పని పురమాయించిన సహోద్యోగులకు భారీగా జరిమానా విధించనుంది.

Published : 30 Dec 2022 19:56 IST

దిల్లీ: ఆఫీస్‌లో పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకోగానే.. కొలీగ్ లేదా బాస్‌ నుంచి ముఖ్యమైన పని ఉందంటూ మెసేజ్‌ లేదా ఫోన్లు రావడం సర్వసాధారణం. కొన్నిసార్లు సెలవులో ఉన్నా కూడా పని గురించి సందేహాలున్నాయని సహోద్యోగులు ఫోన్‌ చేస్తుంటారు. కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ప్లాన్‌ చేసుకున్న హాలిడే కాస్తా.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌గా మారిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో కోపం రావడం సహజం. ఇది ఉద్యోగి రోజువారీ విధులపై ప్రభావం చూపిస్తుందట. అందుకే సెలవులో ఉన్న ఉద్యోగిని  ఆఫీస్‌లో ఉన్నవారు పని పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కార్పొరేట్ కంపెనీలు సరికొత్త విధివిధానాలను రూపొందిస్తున్నాయి. తాజాగా డ్రీమ్‌ 11 (Dream11) కంపెనీ ‘డ్రీమ్‌11 అన్‌ప్లగ్‌’ పేరుతో కొత్త పాలసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఇందులో భాగంగా  సెలవులో ఉన్న ఉద్యోగులకు ఆఫీస్‌కు సంబంధించిన ఎలాంటి పని కేటాయించకూడదు. ఒకవేళ పనికి సంబంధించి ఫోన్‌, మెసేజ్‌, ఈ-మెయిల్‌ చేసినా.. బాస్‌తోపాటు, ఫోన్‌ చేసిన ఉద్యోగికి కంపెనీ జరిమానా విధిస్తుంది. ‘‘మనకు ఎంతో ఇష్టమైన వారితో విహారయాత్రకు వెళ్లేందుకు, వారితో కొంత సమయం గడిపేందుకు లేదా పని ఒత్తిడి నుంచి విశ్రాంతి కోసం సెలవులు తీసుకుంటాం. ఇలాంటివి ఉద్యోగి జీవనప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా,  ఉత్పాదకను పెంపొందించేందుకు దోహదపడతాయి. అందుకే సెలవు రోజుల్లో ఆఫీస్‌ నుంచి ఉద్యోగికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఈ పాలసీని అమలు చేస్తున్నాం. అంతేకాకుండా కంపెనీ ఏ ఒక్క ఉద్యోగిపైనే ఆధారపడి పనిచేయడంలేదని చెప్పడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ’’ అని డ్రీమ్‌11 తెలిపింది. ఈ పాలసీ ప్రకారం సెలవులో ఉన్న ఉద్యోగికి ఆఫీస్‌ పని కోసం ఫోన్‌ చేసిన వారికి లక్ష రూపాయలు జరిమానా విధించనుంది. ఇది కంపెనీలో ప్రతి ఒక్క ఉద్యోగికి వర్తిస్తుందని డ్రీమ్‌11 వెల్లడించింది. 

ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ వేసే వారికి డ్రీమ్‌11 సుపరిచితమే. క్రికెట్‌ సహా హాకీ, ఫుట్‌బాల్‌, కబడ్డీ, హ్యాండ్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్ వంటి క్రీడలపై బెట్టింగ్ వేసేందుకు ఈ వేదిక వీలు కల్పిస్తోంది. 2008లో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో ట్విటర్‌, మెటా వంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తమ సంస్థలో పనిచేసేందుకు రావాలని డ్రీమ్‌11 సహ వ్యవస్థాపకుడు హరీశ్‌ జైన్‌ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త పాలసీ అమలుతో మరోసారి డ్రీమ్‌11 వార్తల్లో నిలిచింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు