Air conditioners: ఏసీ ధరలకు ఎండల మంట

ఉత్తర భారతాన్ని ఠారెత్తిస్తున్న ఎండల వల్ల, ఎయిర్‌ కండీషనర్ల (ఏసీ)కు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఏసీల నిల్వలను ఉత్తరాదికి కంపెనీలు తరలిస్తున్నాయి.

Published : 20 Jun 2024 03:05 IST

ఉత్తరాదికి తరలుతున్న నిల్వలు
విదేశాల నుంచి విమానాల్లో విడిభాగాల దిగుమతి
రాగి, స్టీల్‌ ధరలు పెరగడం వల్ల కూడా
ఈనాడు వాణిజ్య విభాగం

ఉత్తర భారతాన్ని ఠారెత్తిస్తున్న ఎండల వల్ల, ఎయిర్‌ కండీషనర్ల (ఏసీ)కు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఏసీల నిల్వలను ఉత్తరాదికి కంపెనీలు తరలిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లు ఏసీలు సత్వరం తయారు చేసేందుకు అవసరమైన విడిభాగాలను విదేశాల నుంచి విమానాల్లో దిగుమతి చేసుకుంటున్నందున, రవాణా ఛార్జీలు అధికమవుతున్నాయి. ఏసీల తయారీలో కీలకమైన రాగి, అల్యూమినియం, స్టీల్‌ ధరలు కూడా ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే బాగా పెరిగినందున, మొత్తంమీద ఏసీల ధరలు 4-8% అధికమయ్యాయని కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. 

సాధారణంగా ఏటా జనవరి నుంచి మే నెల వరకు ఏసీలకు గిరాకీ అధికంగా ఉంటుంది. ఏసీలకు డిమాండ్‌ను అంచనా వేసుకుని, కంపెనీలు ఏటా అక్టోబరు-డిసెంబరు నెలల్లోనే విడిభాగాలు, ముడిపదార్థాలు సిద్ధం చేసుకుంటాయి. అవసరమైన వాటిని నౌకల ద్వారా దిగుమతి చేసుకుంటాయి కనుక రవాణా ఛార్జీలు అదుపులో ఉంటాయి. సాధారణంగా మే తరవాత ఏసీల అమ్మకాలు నెమ్మదిస్తాయి. ఈసారి జూన్‌ మూడోవారం వచ్చినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో, ఏసీలకు అధిక గిరాకీ నెలకొంది. రుతుపవనాల రాకతో జూన్‌ మొదటివారంలో దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినా, మళ్లీ ఎండలు మండుతున్నాయి. ఫలితంగా ఇక్కడా ఏసీల అమ్మకాలు సాధారణం కంటే అధికంగానే జరుగుతున్నాయని విక్రేతలు చెబుతున్నారు. 

కొన్ని విడిభాగాలకు దిగుమతులే ఆధారం: ఏసీలను రూపొందించడం మనదేశంలో జరుగుతున్నా, కీలకమైన కంప్రెషర్, మైక్రోప్రాసెసర్, క్రాస్‌ ఫ్లో ఫ్యాన్ల వంటి కొన్ని విడిభాగాలను మన కంపెనీలు చైనా, తైవాన్, థాయిలాండ్, మలేసియా, జపాన్‌ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అకస్మాత్తుగా పెరిగిన గిరాకీని కంపెనీలు ఊహించలేకపోవడం వల్ల, వీటి నిల్వలు అడుగంటాయి. మళ్లీ కొత్తగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఫలితంగా ధరలు ఎక్కువయ్యాయి. గిరాకీకి అనుగుణంగా సత్వరం విమానాల్లో తెప్పిస్తున్నందున, రవాణా ఖర్చులు బాగా పెరిగాయి. ఏసీలు డెలివరీ చేసినా, వాటిని ఇళ్లు/కార్యాలయాల్లో బిగించాల్సిన కంపెనీల సర్వీస్‌ సిబ్బంది తక్కువగా ఉండటంతో, వారు 3-4 రోజులకు కూడా రావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరీ అధికంగా ఉన్నందున, ఏసీల నిల్వలను కొన్ని కంపెనీలు అటు తరలిస్తున్నాయి. 

విక్రయాలు 70% పెరిగాయి.. బి.త్యాగరాజన్, ఎండీ, బ్లూస్టార్‌: గతేడాది కంటే ప్రస్తుత వేసవి సీజన్‌లో ఏసీల విక్రయాలు 25-30% పెరుగుతాయని పరిశ్రమ అంచనా వేసింది. అయితే ఈసారి 70% వృద్ధి లభించడంతో, మార్కెట్లో ఏసీల నిల్వలు అడుగంటాయి. ఏసీల తయారీలో కీలకమైన రాగి ధర గత డిసెంబరులో టన్ను 8300 డాలర్లు ఉంటే, ఇప్పుడు 10,100 డాలర్లు అయ్యింది. స్టీల్‌ ధర టన్ను 585 డాలర్ల నుంచి 800 డాలర్లపైకి, అల్యూమినియం ధర టన్ను 2100 డాలర్ల నుంచి 2500 డాలర్లకు చేరింది. దీనికి తోడు విదేశాల నుంచి అత్యవసరంగా విడిభాగాలు తెప్పిస్తుండటంతో, వాటి ధర, రవాణా ఖర్చులూ అధికమయ్యాయి. అందువల్లే ఏసీల ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఇంత అమ్మకాలు జరుగుతున్నందున, వచ్చే పండగల సీజన్‌లో ఏసీలకు గిరాకీ నెమ్మదించే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని