Festive sale: 4 రోజుల్లో ₹24,500 కోట్ల అమ్మకాలు.. నిమిషానికి 1100 ఫోన్లు సేల్‌!

దసరా, దీపావళి సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థలు ప్రకటించిన ఫెస్టివల్‌ సేల్స్‌లో విక్రయాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

Published : 27 Sep 2022 21:34 IST

ముంబయి: దసరా, దీపావళి సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థలు ప్రకటించిన ఫెస్టివల్‌ సేల్స్‌లో విక్రయాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి 25 మధ్య తొలి నాలుగు రోజుల్లోనే రూ.24,500 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ప్రమఖ కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్‌ తెలిపింది. ఈ సేల్‌లో ప్రధాన ఇ-కామర్స్‌ వేదికలపై సగటున నిమిషానికి 1100 మొబైల్‌ ఫోన్లు విక్రయమైనట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ నాలుగు రోజుల్లో రూ.11వేల కోట్ల విలువైన ఫోన్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించింది.

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌బిలియన్‌ డేస్’‌, అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్’‌, మీషో ‘మెగా బ్లాక్‌ బస్టర్‌ సేల్‌’ పేరుతో సేల్స్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు మింత్రా, అజియో, నైకా సైతం పండగ ఆఫర్లు ప్రకటించాయి. దీపావళి వరకు ఈ కంపెనీలన్నీ మూడు సేల్స్‌ వరకు నిర్వహిస్తుంటాయి. అయితే, తొలి సేల్‌లోనే 50 శాతం సేల్స్‌ జరుగుతుంటాయి. అలా ఈసారి తొలి సేల్‌లో గతేడాది తొలి నాల్రోజులతో పోల్చినప్పుడు 1.3 రెట్ల అధికంగా విక్రయాలు జరిగినట్లు రెడ్‌సీర్‌ తెలిపింది. తొలి సేల్‌లో మొత్తం రూ.41వేల కోట్ల మేర విక్రయాలు జరుగుతాయని తాము అంచనా వేయగా.. అందులో తొలి నాలుగు రోజుల్లోనే 60 శాతం విక్రయాలు జరిగనట్లు రెడ్‌సీర్‌ అసోసియేట్‌ పార్ట్‌నర్‌ సంజయ్‌ కోఠారి తెలిపారు. మొత్తంగా 60-70 లక్షల మొబైళ్లు అమ్ముడయ్యాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని