e-rupee: మరో 5 బ్యాంకులు, 9 నగరాల్లో ఇ-రూపీ ప్రయోగాలు

e-rupee: రిటైల్‌ ఇ-రూపీ ప్రయోగాలను మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. మరిన్ని బ్యాంకులు సైతం ఇందులో పాలుపంచుకోనున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.

Published : 08 Feb 2023 18:24 IST

ముంబయి: ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇ-రూపీ (e-rupee) ప్రయోగాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరింత విస్తృతం చేయనుంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీగా వ్యవహరించే ఈ ఇ-రూపీ రిటైల్‌ ప్రయోగాలను మరో 5 బ్యాంకులు, 9 నగరాలకు విస్తరించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. టోకు అవసరాలకు సంబంధించిన ఇ-రూపీ ప్రయోగాలను గతేడాది నవంబర్‌ 1న, రిటైల్‌ అవసరాలకు సంబంధించిన ఇ-రూపీని డిసెంబర్‌ 1న ఆర్‌బీఐ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రిటైల్‌ ఇ-రూపీని ప్రయోగాత్మకంగా 50 వేలమంది వినియోగదారులు, 5 వేల మంది వ్యాపారులు వినియోగిస్తున్నారని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఐదు నగరాల్లో 8 బ్యాంకుల్లో ఈ సేవలను అందుబాటులో ఉన్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి రవి శంకర్‌ తెలిపారు. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇ-రూపీ విషయంలో ఆదరాబాదరాగా వెళ్లాలని ఆర్‌బీఐ అనుకోవడం లేదన్నారు. ఎలాంటి అవరోధాలూ తలెత్తకూడదన్న ఉద్దేశంతో నెమ్మదిగా ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

తొలుత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌.. తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రిటైల్‌ ఇ-రూపీ ప్రయోగాల్లో భాగస్వాములయ్యాయి. వినియోగదారులు, వ్యాపారులతో కూడిన ఎంపిక చేసిన సమూహం మధ్య ప్రయోగాలు జరుగుతున్నాయి. డిజిటల్‌ కరెన్సీ అనేది ప్రస్తుత కరెన్సీ నోట్లకు డిజిటల్‌ రూపం మాత్రమే. వీటికి ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుత నగదు కొనసాగుతుంది. అదనపు చెల్లింపు అవకాశాలను కల్పించేందుకే సీబీడీసీని తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ ఇది వరకే స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని