E-rupee: చలామణీలో ₹130 కోట్ల డిజిటల్‌ రూపాయిలు: నిర్మలా సీతారామన్‌

దేశంలో ఇ-రూపీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. మూడు నెలలుగా వీటి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 130 కోట్లకు పైగా డిజిటల్‌ రూపాయలు చలామణీలో ఉన్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Published : 13 Mar 2023 16:17 IST

దిల్లీ: చట్టబద్ధ కరెన్సీకి అదనంగా తీసుకొస్తున్న సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్ కరెన్సీ (ఇ-రూపీ) ప్రయోగాలు దేశంలో కొనసాగుతున్నాయి. రిటైల్‌, టోకు విభాగాల్లో ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న ఈ కరెన్సీ (E-rupee) విలువ ప్రస్తుతం రూ.130 కోట్లపైనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman) తెలిపారు. ఫిబ్రవరి 28 నాటికి రిటైల్‌ డిజిటల్‌ రూపాయలు (e?-R) రూ.4.14 కోట్లు, హోల్‌సేల్‌ (e?-W) రూ.126.27 కోట్లు చొప్పున చలామణీలో ఉన్నాయని లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిజిటల్‌ రూపాయిని గతేడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 1న హోల్‌సేల్‌ విభాగంలో, డిసెంబర్‌ 1 నుంచి రిటైల్‌ విభాగంలో దీని ప్రయోగాలు ప్రారంభించింది. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేటు బ్యాంకులు కలిపి మొత్తం 9 బ్యాంకులు హోల్‌సేల్‌ పైలట్‌ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

బ్యాంకులు అందించే డిజిటల్‌ వ్యాలెట్ల ద్వారా డిజిటల్‌ రూపాయితో లావాదేవీలు జరపొచ్చని కేంద్రమంత్రి చెప్పారు. టీ దుకాణాదారులు, పండ్ల విక్రేతలు, వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులతో పాటు రిటైల్‌ ఔట్‌లెట్లు, పెట్రోల్‌ పంపులు కూడా ఈ ప్రయోగాల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. కొన్ని ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు సైతం ఉన్నాయని చెప్పారు. ప్రయోగాల్లో భాగంగా సాంకేతిక పనితీరు, డిజైన్‌ గురించి తెలుసుకుంటున్నామని, వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఇ-రూపీని దశలవారీగా విస్తరించే అంశంపై దృష్టి సారించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

చలామణీలో ఉన్న నగదు ₹31 లక్షల కోట్లు

2014 నాటికి ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్న నగదు విలువ రూ.13 లక్షల కోట్లుగా కాగా.. ఆ విలువ 2022 నాటికి రూ.31.33 లక్షల కోట్లకు చేరిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు వెల్లడించారు. 2014లో జీడీపీలో 11.6 శాతంగా ఉన్న నగదు విలువ (నోట్లు, నాణేలు కలిపి) వాటా 2022 మార్చి 25 నాటికి 13.7 శాతానికి పెరిగిందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా 2016 మార్చి నాటికి రూ.16.63 లక్షల కోట్లుగా ఉన్న నగదు విలువ.. 2017 మార్చి నాటికి రూ.13.35 లక్షల కోట్లకు పడిపోయింది. ఆ మరుసటి ఏడాది నుంచి మళ్లీ పెరుగుతూ వచ్చింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నల్లధనం నిరోధించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. నకిలీ నోట్ల అరికట్టేందుకే పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని