Cost Cutting: ఖర్చులను తగ్గించుకోవడానికి సులువైన మార్గాలున్నాయా?
ద్రవ్యోల్బణం పెరిగిన ఈ రోజుల్లో డబ్బును పరిమితంగా ఖర్చు పెట్టి ఆదా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పటితో పోలిస్తే ఖర్చులు చాలా పెరిగాయి. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. వ్యక్తుల అలవాట్లు, జీవనశైలిలో వేగవంతమైన మార్పుల కారణంగా, ఇతరులను అనుసరించడం, వివిధ కారణాల వల్ల కూడా ఖర్చులు చాలా వరకు పెరిగిపోయాయి. అయితే ఖర్చులను తగ్గించుకోవడానికి సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని పొదుపు నియమాలు పాటించాలి.
బడ్జెట్
చాలా మంది ఖర్చులను నిర్వహించడానికి బడ్జెట్‌ను చూడరు. ఏదోలాగా ముందుకెళిపోతుంటారు. బడ్జెట్‌ను అనుసరించడం వల్ల ఖర్చులను ట్రాక్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందుచేత మీ ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేయడం ప్రారంభించండి. దీనివల్ల ప్రతీ అవసరానికి నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించడం అలవాటు అవుతుంది. బడ్జెట్‌ను రూపొందించడానికి మీరు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం అవసరం. దీన్ని బట్టి మీరు సంపాదించేదానికంటే తక్కువ ఖర్చు చేయడానికి ప్రణాళికను రూపొందించుకోవాలి.
ఇంటి ఎంపిక
ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి పెద్ద ఖర్చు ఏంటంటే ఇంటిని కలిగి ఉండడం. మీకు సరైన ఆర్థిక స్థోమత లేనప్పుడు అద్దె ఇంటికే ప్రాధాన్యం ఇవ్వండి. ఈ రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. దూరం అయినా తక్కువ అద్దెకు లభించే ఇంటిలో నివసించడానికి ప్రాధాన్యం ఇవ్వండి. దీనివల్ల నెల ఖర్చులో ఎక్కువ భాగం ఆదా చేయొచ్చు.
అనవసర ఖర్చులు తగ్గించుకోండి
జీవించడానికి ఆహారం అవసరమైనా, దీన్ని ఇంట్లోనే తయారుచేసుకోవడం ఉత్తమం. బయట రెస్టారెంట్‌లకు వెళ్లడమంటే అనవసర ఖర్చే. వంటరానివాళ్లు కూడా యూట్యూబ్‌లో చూసి ఏ రకమైన వంటయినా చేసేయొచ్చు. దీనివల్ల ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. ఇంకా మీరు ఉపయోగించని మ్యాగజైన్‌లు, స్ట్రీమింగ్ సేవలు లేదా మెంబర్‌షిప్‌లు ఉంటే ఇకపై వాటిని రద్దు చేసుకోండి. ఖరీదైన బ్రాండ్‌లకు బదులుగా సాధారణమైన బ్రాండ్ వస్తువులనే కొనుగోలు చేయండి. కొన్ని సాధారణ వస్తువులను, గ్రాసరీలను డిస్కౌంట్స్ లభించే మాల్స్‌లో కొనుగోలు చేసినా, ఆభరణాలను, దుస్తులను సాధారణ షాపుల్లోనే కొనుగోలు చేయండి. అంతేకాకుండా ఇంట్లో ఉండే అనేక ఉపకరణాల వల్ల ఖర్చు పెరుగుతుంది. కాంతినిచ్చే మామూలు బల్బలు, ట్యూబ్‌లను ‘ఎల్ఈడీ’లతో భర్తీ చేయండి. ఏసీ, ఫ్రిజ్ లాంటి ఉపకరణాలు వాడేటప్పుడు విద్యుత్ ఆదా చేయడానికి 5 స్టార్ రేటింగ్ ఉన్నవాటిని ఎంచుకోండి. దీని వల్ల ప్రతి నెలా విద్యుత్ బిల్లులో గణనీయంగా ఆదా చేసుకోవచ్చు.
కొనుగోళ్ల ప్లాన్
మీరు కొనుగోలు చేయవలసిన వాటిని ముందుగానే ప్లాన్ చేసి ఒక కాగితం మీద రాసుకోండి. దీనివల్ల ఆ వస్తువుల కొనుగోలుకే కట్టుబడి ఉంటారు. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయకుండా, డబ్బు ఆదా చేయడంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు యాదృచ్చికంగా వస్తువులను కొనుగోలు చేయకుండా ఆపుతుంది. దీన్ని అలవాటుగా చేసుకోవడం వల్ల జీవితకాలంలో చాలా డబ్బును ఆదా చేయొచ్చు.
ధరలను సరిపోల్చండి
మీరు ఏదైనా ఒక వస్తువు ధరను చూసినప్పుడు, అదే ఫైనల్ అనుకోవద్దు. ఇంకా ఉత్తమమైన క్వాలిటీ వస్తువును సరసమైన ధరకు కొనుగోలు చేయడానికి కొన్ని షాపులు తిరగండి. ఇంకా మీ డబ్బుకు అత్యుత్తమ విలువను పొందుతున్నారని నిర్దారించుకోవడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ధరలను సరిపోల్చండి. మీరు కొనుగోలు చేసేది రెగ్యులర్ వస్తువు కానప్పుడు, అది కొనే ముందు కొద్ది సమయాన్ని వెచ్చించం మర్చిపోవద్దు. సరైన ధరకు కొనుగోలు చేస్తున్నారని నిర్ధారించుకోండి. అంతేకాకుండా షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్లు, కూపన్ల కోసం చూడండి. ఈ రోజుల్లో చాలా క్రెడిట్ కార్డులు డబ్బు ఆదా చేయడానికి చాలా ఆఫర్లను అందిస్తున్నాయి.
జీవనశైలి ఖర్చులు
చాలా మంది ఆదాయం పెరిగే కొద్దీ తమ జీవనశైలిని మార్చుకుంటారు. దీనివల్ల జీవనశైలి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. మీ ఆదాయం పెరిగినప్పటికీ, మీ ఖర్చును అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా డబ్బును ఆదా చేయొచ్చు. ఖరీదైన వస్తువులకు ప్రత్యామ్నాయ ఎంపికల గురించి ఆలోచించాలి. అంటే ఏదైనా ఖరీదైన వస్తువును కొనుగోలు చేయడానికి బదులు అద్దెకు తీసుకోవాలి. ఉదా: ఒకరి ఆదాయం పెరిగి కాస్త మిగులు సొమ్ములు ఏర్పడగానే, కారు కొనుగోలు చేశారనుకుందాం. ఆ కారుకు మెయింటెనెన్స్ రూపంలో అనేక ఖర్చులు ఉంటాయి. ఎక్కువ కిలోమీటర్లు తిరగకపోయినా కూడా ఇన్సూరెన్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే సర్వీసింగ్ ఛార్జీలుంటాయి. పార్కింగ్ ఛార్జీలు చెల్లించాలి. ఈ విధంగా మెయింటెనెన్స్ రూపంలో ఖర్చులు పెరిగిపోతుంటాయి. దీనికి బదులుగా కారులో వెళ్లాలనుకునేవారు క్యాబ్ సర్వీసును బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల ఖర్చులు ఆ కొద్ది సమయానికే ఉంటాయి.
బీమా
జీవిత బీమా ఈ రోజుల్లో అత్యవసరం. కానీ, చాలా మంది మోహమాటం కొద్ది బీమా, పెట్టుబడిని కలిపి ఉన్న పాలసీ తీసేసుకుంటారు. దీనివల్ల అదనపు ఖర్చు అవుతుందే కానీ ఏ మాత్రం సరిపడా బీమా రక్షణ లభించదు. కాబట్టి జీవిత రక్షణకు ఆన్‌లైన్‌లో టర్మ్ బీమాను తీసుకోవడం చాలా మంచిది. టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం వల్ల చాలా ప్రీమియంను ఆదా చేయొచ్చు. ప్రీమియంలో డబ్బు ఆదా చేస్తే, ఖర్చులను తగ్గించుకున్నట్లే. ఇలా మిగిల్చిన ఖర్చులను ఏదైనా మంచి పొదుపు సాధనంలో ఆదా చేయొచ్చు.
నగదు ఖర్చు
మీరు ఖర్చులను బాగా తగ్గించుకోవాలనుకుంటే.. కార్డు చెల్లింపులు మానేసి, నగదు చెల్లింపులకు సిద్ధం కండి. క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపుల కంటే, ఖర్చులకు చేతితో నగదు ఇచ్చేటప్పుడు, పొదుపును ఎక్కువ పాటిస్తున్నారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నగదును ఉపయోగించడం అంటే మీ ఆదాయానికి మించి ఎక్కువ ఖర్చు చేయలేరు. మీ జీవనశైలి కూడా మీ ఆదాయానికి తగ్గట్టుగా ఉంటుంది.
రుణాలు
ఈ రోజుల్లో రుణాన్ని ఆశ్రయించనివారుండరు. కానీ, ఈ రుణాలు తీసుకునేటప్పుడు స్వల్పకాలానికి ఈఎంఐలు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల వడ్డీ కూడా స్వల్పకాలానికే చెల్లిస్తారు. స్వల్పకాల రుణం కాబట్టి రుణం త్వరగా పూర్తవుతుంది, వడ్డీ భారం కూడా బాగా తగ్గుతుంది. ప్రీ-పేమెంట్ ఛార్జీల నుంచి కూడా తప్పించుకోవచ్చు. క్రెడిట్ కార్డు రుణం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం మేలు, అది కూడా స్వల్పకాలానికే చెల్లింపులు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
చివరిగా: ఇలా చాలా ఖర్చులను తగ్గించుకుని.. మిగిలిన డబ్బుతో పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లల చదువు, సొంత ఇల్లు, పదవీ విరమణ నిధి మొదలైన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి పొదుపు ఉపయోగపడుతుంది. జీవితంలో అత్యవసరమైన వాటిని పొందడానికి పైన తెలిపినవి చాలా వరకు సహాయపడతాయి. డబ్బును ఆదా చేయడమంటే..అదనంగా సంపాదించినట్టే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మాలేపాటి సుబ్బానాయుడి గృహ నిర్బంధం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Delhi Liquor scam: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!