Taiwan: తన్నుకొస్తున్న తైవాన్ ముప్పు?.. ప్రపంచ ఆర్థికంపై ప్రభావమెంత..?
కరోనా సంక్షోభం, ఇంధన కొరత, ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో సమస్యలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణం.. ఇలా వరుస పరిణామాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరవుతోంది. చివరకు ఆర్థిక మాంద్యం అంచున వచ్చి కూర్చుంది. ఈ తరుణంలో తైవాన్ (Taiwan) రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తైవాన్ (Taiwan)పై చైనా (China)యే గనక సైనిక చర్యకు దిగితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కంటే కూడా ప్రభావం చాలా రెట్లు ఎక్కువుండే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు కొత్తగా ఈ ముప్పు కూడా తోడైతే 2008 నాటి ఆర్థిక మాంద్యం పునరావృతం కావడం ఖాయమని నిపుణుల విశ్లేషణ.
మూడొంతుల జలరవాణాపై ప్రభావం..
రష్యా-ఉక్రెయిన్ తరహాలో ఈ వివాదం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. ఒకవేళ అమెరికా జోక్యం చేసుకుంటే.. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య యుద్ధంగా ఇది పరిణమిస్తుంది. జపాన్ కూడా యూఎస్ వెనకొస్తే ప్రమాదం మరింత తీవ్రమవుతుంది. ఒకవేళ చైనా (China) దాడికి దిగితే.. క్షిపణులను విస్తృతంగా వినియోగించే అవకాశం ఉంది. దీనివల్ల గగనతలం, సముద్రమార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారి ఆ ప్రభావం సరఫరా వ్యవస్థలపై ఉంటుంది. దీంతో ప్రపంచంలో మూడొంతుల జలరవాణాకు వేదికగా ఉన్న ఇండోపసిఫిక్లోని నౌకామార్గాలపై ప్రభావం పడుతుంది.
దాడి.. ప్రతిదాడి..
ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేయడం కోసం అమెరికా ఆర్థిక ఆంక్షల్ని ఆయుధంగా వాడుకొనే అవకాశం ఉంది. చైనా (China) ఇంధన దిగుమతులను నిషేధించవచ్చు. ఫలితంగా బీజింగ్ మిలిటరీ కదలికల్ని నిలువరించే ప్రయత్నం చేయవచ్చు. చైనా యుద్ధాన్ని మరింత ఖరీదుగా మార్చేందుకు అమెరికా మిత్రదేశాలు సైతం ఆర్థిక ఆంక్షల్ని అమలు చేసే అవకాశం ఉంది. ప్రతిగా చైనా తమ దేశంలో అమెరికా, ఆ దేశ సంస్థల ఆస్తుల్ని తమ అధీనంలోకి తీసుకోవచ్చు. ఇలా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే అమెరికా జీడీపీలో 5-10 శాతం, చైనా జీడీపీలో 25-35 శాతం కోత పడే అవకాశం ఉందని అంచనా. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలపై ఉండే ఈ ప్రతికూల ప్రభావం ఇతర దేశాలకూ వ్యాపించడం తథ్యం!
ప్రపంచానికి ‘చిప్’ల కొరత
ప్రపంచ సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ (Taiwan) వాటాయే 30 శాతం. దీంట్లో మళ్లీ దాదాపు 90 శాతం అత్యాధునిక సెమీకండక్టర్లు ఈ దేశంలోనే తయారవుతున్నాయి. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఆటోమొబైల్స్ సహా ఇతర డిజిటల్ పరికరాల్లో ఉపయోగించే చిన్న, మధ్య శ్రేణి ఎలక్ట్రానిక్ చిప్‌లకు ప్రస్తుతం ‘తైవానీస్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ (TSMC)’ ఓ అడ్డా. యాపిల్, క్వాల్కామ్ వంటి టెక్ దిగ్గజాలు సహా అమెరికా మిలిటరీ అవసరాలకు కూడా ఈ కంపెనీ చిప్‌లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీని అదుపులోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
ఇతర దేశాలపై ఇలా...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో చైనా ఏ స్థాయిలో పెనవేసుకుపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ కర్మాగారంగా ఉన్న డ్రాగన్.. ఉత్పత్తిని ఏమాత్రం తగ్గించినా దాని ప్రభావం పెద్దఎత్తున ఉంటుంది. చాలా దేశాల నుంచి ముడి సరకుల్ని దిగుమతి చేసుకుంటున్న చైనా.. వాటిని నిలిపివేస్తే ఆ ప్రభావం చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలను చిదిమేస్తుంది. భారత్ సహా ఐరోపా దేశాలు చైనాపై ఏ స్థాయిలో ఆధారపడి ఉన్నాయో కరోనా సంక్షోభం కళ్లకు కట్టింది. చైనా, తైవాన్ నుంచి ఎగుమతి, దిగుమతులు పూర్తిగా నిలిచిపోతే ఇటు సెమీకండక్టర్లతో పాటు అటు కీలక కమొడిటీల కొరత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికా, దాని మిత్రదేశాల నౌకాయానాన్ని చైనా లక్ష్యంగా చేసుకుంటే.. జపాన్ ఎగుమతి, దిగుమతులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
చైనాకూ తిప్పలు తప్పవు..
ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు ఎంత నష్టమో.. చైనా ఆర్థిక వ్యవస్థకు అంతకంటే ప్రమాదం. ఆహార వస్తువులు, చమురు కోసం ఈ దేశం పెద్దఎత్తున దిగుమతులపై ఆధారపడుతోంది. మరోవైపు ఈ దేశ జీడీపీలో ఎగమతులదే ప్రధాన వాటా. ఒకవేళ అమెరికా ఆంక్షల్ని అమలు చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకు వస్తే పెద్ద ఎత్తున చైనా ఎగుమతులు నిలిచిపోతాయి. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది. అలాగే ఎఫ్‌డీఐల రూపంలో భారీ మొత్తంలో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి లాభాల్ని ఆర్జిస్తున్న చైనా మారక నిల్వల వనరులు దెబ్బతింటాయి. అమెరికా పరికరాలు, విడిభాగాలు లేని చైనా ఉత్పత్తుల కొనుగోలుకు ప్రపంచ దేశాలు విముఖత వ్యక్తం చేయొచ్చు. ఇది విదేశీ మార్కెట్లపై ఆధారపడ్డ చైనా కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బ.
2020లో చైనా చమురు కంటే చిప్‌ల దిగుమతి కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. అంటే తైవాన్‌పై చైనా ఏ స్థాయిలో ఆధారపడుతుందో తెలుస్తోంది. ఒకవేళ తైవాన్ సెమీకండక్టర్ల ఉత్పత్తి నిలిచిపోతే.. చైనాలోని ఎలక్ట్రానిక్స్, తయారీ పరిశ్రమలు పూర్తిగా మూతపడిపోతాయి. తైవాన్‌లోని సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆక్రమించుకోవాలని చైనా ప్రయత్నించొచ్చు. అంత వరకూ వస్తే ఆయా కంపెనీలను పూర్తిగా ధ్వంసం చేయడానికీ వెనుకాడబోమని ఇప్పటికే తైవాన్ సంకేతాలిచ్చింది. టీఎస్ఎంసీ ఛైర్మన్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. అక్కడి సిబ్బంది సహకారం లేకుండా చైనా సెమీకండక్టర్ల కంపెనీలను నిర్వహించగలదా అంటే ప్రశ్నార్థకమే.
భారత్‌కూ ప్రమాదమే..
చాలా దేశాల తరహాలోనే భారత్ కూడా తైవాన్‌తో ఎలాంటి అధికారిక దౌత్య సంబంధాలు నెరపడం లేదు. కానీ, 1990ల నాటి నుంచి ఇరు దేశాల మధ్య మంచి మైత్రి కొనసాగుతోంది. భారత్‌లో సెమీకండక్టర్ల పరిశ్రమల స్థాపనకు తైవాన్ సహకారం ఎంతో అవసరం. తాజా పరిణామాల వల్ల ఆ ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు భారత్.. తైవాన్‌కు మద్దతుగా నిలిస్తే.. ఇప్పటికే చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉంది. అలాగే చైనాపై పెద్ద ఎత్తున ఆధారపడ్డ కెమికల్, ఫార్మా కంపెనీలపై తీవ్ర పభావం ఉంటుంది.
-ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
-
India News
Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
-
Sports News
CWG 2022: మేం రజతం గెలవలేదు.. స్వర్ణం కోల్పోయాం: శ్రీజేశ్
-
Politics News
Rajagopalreddy: మాజీ ఎంపీలతో కలిసి బండి సంజయ్‌తో రాజగోపాల్ రెడ్డి భేటీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Latestnews News
Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!