ED: ఏబీజీ షిప్‌యార్డ్‌పై ఈడీ కొరడా.. రూ.2,747 కోట్ల ఆస్తులు అటాచ్‌!

దేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్‌ మోసంగా నిలిచిన ఏబీజీ షిప్‌యార్డ్‌ (ABG Shipyard) వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా కొరడా ఝులిపించింది. ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా...

Published : 22 Sep 2022 23:18 IST

దిల్లీ: దేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్‌ మోసంగా నిలిచిన ఏబీజీ షిప్‌యార్డ్‌ (ABG Shipyard) వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తాజాగా కొరడా ఝుళిపించింది. ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా రూ.2,747 కోట్లకుపైగా విలువైన షిప్‌యార్డ్‌లు, వ్యవసాయ భూములు, వాణిజ్య ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లను అటాచ్ చేసినట్లు గురువారం వెల్లడించింది. కంపెనీ వ్యవస్థాపక ఛైర్మన్‌ రిషి కమలేశ్‌ అగర్వాల్‌ను సీబీఐ(CBI) అరెస్టు చేసిన మరుసటి రోజే ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

గుజరాత్‌లోని సూరత్, దహేజ్‌లలో ఉన్న షిప్‌యార్డ్‌లు, వ్యవసాయ భూములు, ప్లాట్లు; గుజరాత్, మహారాష్ట్రలోని వాణిజ్య, నివాస స్థలాలు; ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్, దాని గ్రూప్ కంపెనీలు, ఇతర సంబంధిత సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలు జప్తు చేసిన వాటిలో ఉన్నాయని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘అక్రమ నగదు చెలామణీ నిరోధక చట్టం’ కింద అటాచ్ చేసిన ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.2,747.69 కోట్లుగా ఉంటుందని వెల్లడించింది.

షిప్పుల తయారీ, రిపేర్‌ వ్యవహారాలను చూసే గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ.. బ్యాంకుల్ని రూ.23 వేల కోట్ల మేర మోసగించిన విషయం తెలిసిందే. రుణాలుగా తీసుకున్న మొత్తాలను అక్రమ కార్యకలాపాలకు, నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ అనే సంస్థ నిర్వహించిన ఆడిట్‌లో తేలింది. దీనిపై బ్యాంకులు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ.. ఈ ఏడాది మొదట్లో రిషి అగర్వాల్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసింది. బుధవారం రిషి అగర్వాల్‌ను అరెస్ట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని