Xiaomi India: విదేశాలకు వేల కోట్ల నిధుల మళ్లింపు.. షావోమి ఇండియా, 3 విదేశీ బ్యాంకులకు ఈడీ నోటీసులు

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షావోమి (Xiaomi) ఇండియా అధికారులకు, మూడు బ్యాంకుల అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. రూ.5,551 కోట్ల నిధుల్లో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

Published : 10 Jun 2023 00:07 IST

దిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్లు రూపాయల నిధులను విదేశాలకు తరలించడంపై చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ షావోమి (Xiaomi) ఇండియాతోపాటు ఇద్దరు వ్యక్తులు, మూడు విదేశీ బ్యాంకు అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. రూ.5,551.27 కోట్ల నిధులకు సంబంధించి విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనలపై షావోమి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీఎఫ్‌వో సమీర్‌ బి రావ్‌, షావోమి ఇండియా మాజీ ఎండీ మనుకుమార్‌ జైన్‌తోపాటు సిటీ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ, డచెస్‌ బ్యాంక్‌ ఏజీ అధికారులకు నోటీసులు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. గతంలో తాము చేపట్టిన దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఫెమా నిబంధనలకు అనుగుణంగా సంబంధిత వ్యక్తులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. 

గతేడాది ఫెమా నిబంధనల ఉల్లంఘనల కింద షావోమి టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ. 5,551.27 కోట్ల నిధులను ఈడీ అధికారులు జప్తు చేశారు. కొన్నేళ్లుగా షావోమి ఇండియా రూ.5,551.27 కోట్లకు సమానమైన నిధులను విదేశాల్లో పనిచేస్తున్న మూడు సంస్థలకు అక్రమంగా పంపిందని ఈడీ ఆరోపించింది. చైనాలోని మాతృ సంస్థ అయిన షావోమి ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసిందని అప్పట్లో ఈడీ వెల్లడించింది. అయితే, ఈ లావాదేవీలకు సంబంధించి అప్పట్లో ఈడీ షావోమి ఇండియా మాజీ ఎండీ మనుకుమార్‌ జైన్‌ను విచారించింది. తాజాగా ఈ లావాదేవీలకు సంబంధించి ఫెమా చట్టం సెక్షన్‌ 16 ఆధారంగా మనుకుమార్‌తోపాటు సీఎఫ్‌వో సమీర్‌ బి రావ్‌, మూడు విదేశీ బ్యాంకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు