Edible Oil Prices: గుడ్‌న్యూస్‌.. మరింత తగ్గనున్న వంటనూనె ధరలు

నిత్యావసరాల ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న సగటు సామాన్య పౌరుడికి ఊరట కలిగించే వార్త ఇది. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నాయి. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ

Updated : 05 Aug 2022 17:46 IST

దిల్లీ: నిత్యావసరాల ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య పౌరుడికి ఊరట కలిగించే వార్త ఇది. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నాయి. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు తయారీ సంస్థలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు కాస్త దిగొచ్చిన నేపథ్యంలో దేశీయంగానూ వీటి ధరలను తగ్గించేందుకు తయారీ సంస్థలు ఈ సమావేశంలో అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. త్వరలోనే వంటనూనె ధరలు రూ.10 నుంచి రూ.12 వరకూ తగ్గే అవకాశాలున్నాయని సదరు వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం.

ఇటీవల ఫార్చూన్‌ బ్రాండ్‌పై వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్‌ కంపెనీ నూనె ధరలను రూ.30 వరకూ తగ్గించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని ఇటీవల కేంద్రం ఆయా కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గిస్తున్నట్లు అదానీ విల్మర్‌ కంపెనీ ప్రకటించింది. అయితే అంతర్జాతీయంగా వంట నూనె ధరలు మరింత తగ్గిన నేపథ్యంలో ధరల తగ్గింపుపై మరోసారి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ సూచించగా.. అందుకు తయారీ సంస్థలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో వంట నూనె ధరలు భగ్గుమన్న విషయం తెలిసిందే. దేశీయంగా లీటర్‌ నూనె ధర రూ.200 దాటేసింది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్లో వంట నూనె ధరలు తగ్గుముఖం పట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని