Updated : 13 Jun 2022 18:23 IST

విద్యా రుణం ప‌రిగ‌ణించాల్సిన ముఖ్య విష‌యాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యా రుణం అనేది ఒక వ్య‌క్తి విద్యార్థి ద‌శ‌లోనే.. అంటే, యుక్త వ‌య‌స్సులో తీసుకునే మొద‌టి పెద్ద ఆర్థిక నిర్ణ‌యాల్లో ఒక‌టి. ముందు నుంచి వారు ఆశించే కోర్సులో లేదా కాలేజీలో చేర‌డం, ఉన్నత విద్యా కోసం విదేశాల‌కు వెళ్ల‌డం అనే కలను దీని ద్వారా సాకారం చేసుకుంటూ ఉంటారు. నాణ్య‌మైన ఉన్న‌త విద్య, స్థిర‌మైన కెరీర్, ఉద్యోగంలో అధిక వేత‌నం పొంద‌డానికి విద్యా రుణం స‌హాయ‌ప‌డుతుంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఉన్న‌త విద్య ఖ‌ర్చులు బాగా పెర‌గ‌డం వ‌ల్ల విద్యార్థుల్లో అధిక భాగం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి విద్యా రుణాల‌ను పొందుతున్నారు.

ఇంజినీరింగ్‌, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంకా ఇత‌ర ఉన్న‌త విద్యా కోర్సుల కోసం బ్యాంకుల వ‌ద్ద విద్యా రుణం తీసుకోవ‌డం ఈ రోజుల్లో మామూలుగా చాలా మంది విద్యార్ధులు చేసే ప‌నే. పెరుగుతున్న విద్యా ద్ర‌వ్యోల్బ‌ణం, అధిక ఫీజుల‌తో క‌లిపి నాణ్య‌మైన విద్య ఇవాళ చాలా ఖ‌రీదైన‌దిగా మారింది. ఔత్సాహిక విద్యార్థులకు ఉన్న‌త విద్య‌కు ఆర్థిక సాయంగా విద్యా రుణం ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యా రుణానికి దర‌ఖాస్తు చేసేముందే.. కోర్సు ఫీజుకే కాకుండా ఆ విద్యకు సంబంధించి అన్ని ఖ‌ర్చులు క‌వ‌ర్ అవుతాయో లేదో త‌నిఖీ చేసుకోవాలి. విద్యా రుణం తీసుకున్న త‌ర్వాత చ‌దువుకునే మార‌టోరియం వ్య‌వ‌ధిలో రుణ భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి వ‌డ్డీని చెల్లించే అవ‌కాశం కూడా ఉంటుంది.

దర‌ఖాస్తు ముందు ప‌రిగ‌ణించాల్సిన అంశాలు..

రుణ మొత్తం:  కోర్సు రుసుము కాకుండా, హాస్ట‌ల్ ఫీజు, ల్యాప్‌టాప్‌, ముఖ్య‌మైన ప‌రిక‌రాలు, పుస్త‌కాల ఖ‌ర్చు స‌హా ప్ర‌ధాన ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి మీ విద్యా రుణం మొత్తం అవ‌స‌ర‌మైనంత ఉండాలి. దేశీయ‌ కోర్సుల‌కు గ‌రిష్ఠ రుణ మొత్తం వ‌రుస‌గా రూ.10 లక్ష‌లు, 20 ల‌క్ష‌లు దాకా కూడా ఉన్నాయి. అయితే ఐఐఎంలు, ఐఐటీలు, ఐఎస్‌బీ మొద‌లైన ప్ర‌సిద్ధ సంస్థ‌లు అందించే కోర్సుల కోసం బ్యాంకులు అధిక రుణ మొత్తాల‌ను ఆమోదించ‌వ‌చ్చు. కాబ‌ట్టి మీరు మీ కోర్సు కోసం వీలైన ఎక్కువ బ్యాంకుల రుణ మొత్తాలు, వ‌డ్డీ వివ‌రాలు తెలుసుకోవ‌డం మంచిది.

తిరిగి చెల్లింపు వ్య‌వ‌ధి:  రుణ‌గ్ర‌హీత‌లు త‌మ ఈఎంఐల‌ను చెల్లించ‌డానికి కోర్సు వ్య‌వ‌ధే కాకుండా అద‌నంగా 1 సంవ‌త్స‌రం మార‌టోరియం వ్య‌వ‌ధిని బ్యాంకులు అందిస్తాయి. రుణ గ్ర‌హీత‌లు త‌మ ఈఎంఐల‌ను తిరిగి చెల్లించ‌డం ప్రారంభించిన త‌ర్వాత 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు విద్యా రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి వ్య‌వ‌ధిని పొందుతారు. అయితే వ‌డ్డీ లెక్కింపు రుణం పంపిణీ అయిన వెంట‌నే ప్రారంభ‌మ‌వుతుంది. ఈ వ‌డ్డీ, అస‌లు మొత్తానికి జోడిస్తారు. ఆ మొత్తం ఈఎంఐలో క‌లుస్తుంది. రుణగ్ర‌హీత నిర్ణీత‌ స‌మ‌యంలోగా కోర్సును పూర్తి చేయ‌లేక‌పోతే లేదా సొంతంగా స్టార్ట‌ప్ లాంటి వ్యాపారాలు మొద‌లుపెడితే బ్యాంకు రుణం తిరిగి తీసుకునే చ‌ర్య‌ను తాత్కాలికంగా 2 సంవ‌త్స‌రాలు పొడిగించ‌వ‌చ్చు.

వ‌డ్డీ రేటు:  విద్యా రుణం వ‌డ్డీ రేటు సాధార‌ణంగా కోర్సు ర‌కం, విద్యార్థి/ స‌హ‌-దర‌ఖాస్తుదారు క్రెడిట్ స్కోర్‌, వారి అందించే హామీల‌పై ఆధార‌ప‌డి దాదాపు ఏడాదికి వ‌డ్డీ రేటు 7.30% నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. బ్యాంకులు మార‌టోరియం వ్య‌వ‌ధిలో సాధార‌ణ వ‌డ్డీ రేట్ల‌ను విధిస్తాయి. ఈఎంఐ తిరిగి చెల్లింపులు ప్రారంభించిన త‌ర్వాత చ‌క్ర‌వ‌డ్డీతో క‌లిపి ఉన్న‌ రేటును వ‌సూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు మార‌టోరియం వ్య‌వ‌ధిలో 1% వ‌ర‌కు వ‌డ్డీ రాయితీని అందిస్తాయి. రుణ‌గ్ర‌హీత‌లు త‌మ వ‌డ్డీ వ్య‌యాన్ని త‌గ్గించుకోవ‌డానికి మార‌టోరియం వ్య‌వ‌ధిలో బ్యాంకు విధించే సాధార‌ణ వ‌డ్డీని చెల్లించ‌డానికి ప్ర‌య‌త్నిస్తే మంచిది.

మార్జిన్ మ‌నీ: రుణ గ్ర‌హీత‌లు త‌మ విద్య‌కు అయ్యే ఖ‌ర్చులో కొంత మొత్తాన్ని వారి సొంత నిధుల నుంచి స‌మ‌కూర్చాల్సి ఉంటుంది. అయితే రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు విద్యా రుణాల‌కు మార్జిన్ మ‌నీ అవ‌స‌రం లేదు. రూ.4 ల‌క్ష‌ల కంటే ఎక్కువ విద్యా రుణాల‌కు భార‌తీయ‌, విదేశీ కోర్సుల‌కు వ‌రుస‌గా 5%, 15% మార్జిన్ మ‌నీ అవ‌స‌రం. అయితే ఎస్‌బీఐ వంటి కొన్ని బ్యాంకులు ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌లో అభ్య‌సించే కోర్సుల కోసం విద్యా రుణానికి మార్జిన్ మ‌నీని మాఫీ చేశాయి.

క‌ళాశాల - బ్యాంకులు/ ఎన్‌బీఎఫ్‌సీల మ‌ధ్య ఒప్పంద భాగ‌స్వామ్యం : అనేక విద్యా సంస్థ‌లు త‌మ విద్యార్థులకు విద్యా రుణాల‌ను ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల‌తో భాగ‌స్వామ్యం క‌లిగి ఉన్నాయి. అందువ‌ల్ల ఉన్నత విద్య‌ను అభ్య‌సించేవారు బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల‌తో ఇప్ప‌టికే ఉన్న ఏవైనా విద్యా రుణ భాగ‌స్వామ్యాల గురించి వారి విశ్వ‌విద్యాల‌యం/ క‌ళాశాల‌లో వాక‌బు చేయాలి. ఇటువంటి ఒప్పందాలు రుణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు విద్యా రుణాల‌ను పొంద‌డంలో కూడా స‌హాయ‌ప‌డొచ్చు.

ఈఎంఐల‌ను చెల్లించేందుకు భ‌విష్య‌త్‌ ఆదాయాల‌ను అంచ‌నా వేయండి: త‌మ ఉన్న‌త విద్యా ఖ‌ర్చుల‌ను రుణం ద్వారా పొందాల‌నుకునే విద్యార్థులు త‌మ క‌ళాశాల‌ల ప్లేస్‌మెంట్ చ‌రిత్ర, అవి గ‌తంలో ప్లేస్‌మెంట్‌లో అందించిన స‌గ‌టు వేత‌నాన్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. ఇది వారికి భ‌విష్య‌త్‌లో నెల‌వారీ ఆదాయం ఎంత సంపాదించ‌వ‌చ్చ‌నే విష‌యంపై సుమారుగా అంచ‌నాకు రావ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. త‌ద‌నుగుణంగా వారి ఈఎంఐలు, రుణ కాల ప‌రిమితి గురించి ఒక అంచ‌నాకు రావ‌చ్చు. రుణ గ్ర‌హీత‌లు తమ విద్యా రుణాన్ని ఎలాంటి ముంద‌స్తు చెల్లింపు పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా ముంద‌స్తుగా చెల్లించ‌వ‌చ్చు.

సొంతంగా గానీ, పిల్ల‌లు, జీవిత భాగ‌స్వామి లేదా సంర‌క్ష‌ణ‌లో ఉన్న పిల్ల‌ల కోసం విద్యా రుణాల‌ను పొందుతున్న వ్య‌క్తులు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80ఈ కింద ప‌న్ను మిన‌హాయింపుల‌ను క్లెయిమ్ చేయ‌డానికి అర్హులు. ఈ మిన‌హాయింపు రుణ వ‌డ్డీ భాగంపై అందుబాటులో ఉంటుంది. గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. అయితే ఈఎంఐలు ప్రారంభ‌మైన రోజు నుంచి 8 సంవ‌త్స‌రాల వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు అందుబాటులో ఉంటుంది. అందువ‌ల్ల రుణ‌గ్ర‌హీత‌లు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పెంచుకోవ‌డానికి 8 సంవ‌త్స‌రాల‌లోపు త‌మ రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి ప్ర‌య‌త్నించాలి.

పూచీక‌త్తు / రుణ హామీదారు:  బ్యాంకులు సాధార‌ణంగా రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు విద్యా రుణాల‌కు తాక‌ట్టు లేదా థ‌ర్డ్‌-పార్టీ గ్యారెంటీ కోసం ప‌ట్టుప‌ట్ట‌రు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్‌ బ‌రోడా వంటి కొన్ని బ్యాంకులు రూ.7.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌కు ఈ ప్ర‌యోజ‌నాన్ని పొడిగించారు. రూ.7.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఉండే విద్యా రుణాల కోసం బ్యాంకుల‌కు.. ఆస్తి, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, బ్యాంక్ డిపాజిట్‌, బీమా పాల‌సీలు మొద‌లైన వాటి రూపంలో హామీ అవ‌స‌రం కావ‌చ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని