విద్యా రుణం - తెలుసుకోవ‌ల‌సిన విష‌యాలు

ఆశించే కోర్సులో చేర‌డం, ఉన్నత విద్య కోసం విదేశాల‌కు వెళ్ల‌డం చాలా మంది విద్యార్ధుల‌ కల.

Published : 27 Jan 2022 13:16 IST

ప్ర‌స్తుతం విద్యార్ధులు విద్యా రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసేట‌ప్పుడు గుర్తించుకోవ‌ల‌సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాలున్నాయి. విద్యా రుణం అనేది ఒక వ్య‌క్తి తీసుకునే విద్యార్ధి ద‌శ‌లోనే.. అంటే, చిన్న వ‌య‌స్సులోనే తీసుకునే మొద‌టి పెద్ద ఆర్ధిక నిర్ణ‌యాల‌లో ఒక‌టి. ఇది వారి విద్యార్ధి ద‌శ త‌ర్వాత వారి ఉద్యోగ జీవితంలో దాదాపు 6 నుండి 7 సంవ‌త్స‌రాల వ‌ర‌కు `ఈఎమ్ఐ` కాల వ్య‌వ‌ధి ఉంటుంది. రుణం తీర్చే వ్య‌వ‌ధి సుదీర్ఘ‌కాలం పెట్టుకుంటే `ఈఎమ్ఐ` త‌గ్గుతుంది. అయితే, ఇది మొత్తం రీపేమెంట్ ఖ‌ర్చును పెంచుతుంది.

ముందు నుండి వారు ఆశించే కోర్సులో లేదా కాలేజీలో చేర‌డం, ఉన్నత విద్య కోసం విదేశాల‌కు వెళ్ల‌డం అనేది చాలా మంది విద్యార్ధుల‌కు డ్రీమ్ నెర‌వేర‌డ‌మే అని చెప్పాలి. అయితే, విద్యా ఖ‌ర్చులు మాత్రం ఖ‌చ్చితంగా పెరుగుతాయి. త‌ల్లిదండ్రులు, విద్యార్ధులు అనేక ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ, పెరుగుతున్న విద్యా ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా ఒక్కోసారి నాణ్య‌మైన విద్య‌ను పొందాల‌నే ల‌క్ష్యం విద్యా రుణంతోనే నెర‌వేరుతుంది.

నేష‌న‌ల్ శాంపిల్ స‌ర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్‌వో) డేటా ప్ర‌కారం, 2008-2014 మ‌ధ్య‌, ప్రైవేట్ విద్యా సంస్థ‌ల‌లో స‌గ‌టు విద్యా ఖ‌ర్చు 175% పెరిగింది. సాంకేతిక‌, వృత్తిప‌ర‌మైన విద్యా కోర్సుల్లో అయితే 96% ఖ‌ర్చులు పెరిగాయి. ఇటువంటి ప‌రిస్థితుల్లో గ్రాడ్యుయేష‌న్ కోర్సు, మాస్ట‌ర్ డిగ్రీ లేదా స్వ‌ల్ప‌కాలిక ప్రొఫెష‌న‌ల్ అప్‌స్కిల్లింగ్ కోర్సును అభ్య‌సించాల‌నుకున్న వారికి విద్యారుణం ఒక ప‌రిష్కారం అవుతుంది.

విద్యార్ధులు ఏదైనా సంస్థ నుండి లోన్ తీసుకునే ముందు, లోన్ ప్రాసెస్‌పై స్ప‌ష్ట‌త పొందాలి. విద్యారుణం తిరిగి చెల్లించే ప్ర‌క్రియ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు, ఒక విద్యార్ధిగా మీరు త‌ప్ప‌నిస‌రిగా కోర్సు ఫీజులు, అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్‌లు, స్కాల‌ర్‌షిప్‌లు, లోన్‌కి సంబంధించిన వ‌డ్డీ, రుణంతో అనుసంధానించ‌బ‌డిన ఏదైనా ప్రాసెసింగ్ ఫీజు గురించి త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి.

విద్యా రుణానికి కావ‌ల‌సిన డాక్యుమెంట్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యార్ధి, విద్యా రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసిన‌పుడు అన్ని డాక్యుమెంట్స్‌ను అందించ‌డం చాలా ముఖ్యం. విద్యార్ధులు, స‌హ ధ‌ర‌ఖాస్తుదారుల కేవైసీ ప‌త్రాలు, ఆధార్ కార్డ్‌, పాన్ కార్డ్‌, పాస్‌పోర్ట్‌, విద్యార్ధి ప‌నిచేసే ప్రొఫెష‌న‌ల్ అయితే అడ్ర‌స్‌, ఫార‌మ్ 16, గ‌త 3 నెల‌ల జీతం స్లిప్‌, జీతం ఖాతా బ్యాంక్ స్టేట్‌మెంట్‌, కంపెనీ ఐడీ లేదా ఆఫ‌ర్ లెట‌ర్‌, ఫీజు షెడ్యూల్‌తో పాటు ఇన్‌స్టిట్యూట్ అడ్మిష‌న్ లెట‌ర్ కాపీ, ఎస్ఎస్‌సీ, హెచ్ఎస్‌సీ, డిగ్రీ కోర్సుల మార్కు షీట్లు లేదా ఉత్తీర్ణ‌త స‌రిఫికెట్లు స‌మ‌ర్పించ‌వ‌ల‌సి ఉంటుంది.

విద్యారుణం రీపేమెంట్ వ్యూహాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. విద్యా రుణాలు సాధార‌ణంగా 8-10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. దీర్ఘ‌కాల వ్య‌వ‌ధి `ఈఎమ్ఐ`ని త‌గ్గించినా రీపేమెంట్ ఖ‌ర్చును పెంచుతుంది. అందుచేత త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోవాలి. అలాగే, విద్యారుణం ప్రీపేమెంట్ (ముందస్తు చెల్లింపు)ను కూడా జీరో పెనాల్టీల‌తో చెల్లించొచ్చు. దీంతో వ‌డ్డీ ఖ‌ర్చులు ఆదా అవుతాయి.

కోర్సు త‌ర్వాత అందుబాటులో ఉన్న ఉద్యోగ అవ‌కాశాల గురించి తెలుసుకోవాలి. మీరు ఎంచుకున్న కోర్సును ఖ‌రారు చేసే ముందు, ఒక విద్యార్ధిగా, డిగ్రీ పొందిన త‌ర్వాత మీరు ఆశించే ఉద్యోగం, క‌నీస జీతం గురించి అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చుకోవాలి. దీంతో మీరు మీ విద్యా రుణం నెల‌వారీ వాయిదాల‌ను చెల్లించ‌గ‌ల‌రా లేదా అనే విష‌యం ముందుగానే తెలుస్తుంది. విద్యారుణం పొంద‌డం వ‌ల‌న ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లోని సెక్ష‌న్ 80(ఈ) కింద మీరు ప‌న్ను మిన‌హాయింపుకు అర్హులు అవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని