విద్యా రుణం vs వ్యక్తిగత రుణం... ఏది బెటర్‌?

విద్యా ఖర్చులను తట్టుకోవడానికి బ్యాంకులు అందించే విద్యారుణం - వ్యక్తిగత రుణం దీని ఏది తీసుకుంటే మంచిదో ఇక్కడ తెలుసుకోండి.

Published : 17 Mar 2023 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉన్నత విద్యను అభ్యసించడానికి చాలా మంది విద్యా రుణాలపై ఆధారపడుతుంటారు. బ్యాంకులు కూడా విద్యారుణాలను విరివిగానే ఇస్తున్నా.. రుణ లభ్యతకు కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. అయితే, వ్యక్తిగత రుణాలు కూడా దీనికోసం ఉపయోగపడొచ్చు.

రుణం అవసరం

ప్రతి సంవత్సరం లక్షలాది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ కెరీర్‌ కోసం స్వదేశీ విదేశీ విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటారు. అనేక విద్యాలయాలు ఫ్యాషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, మరిన్ని ప్రత్యేక కోర్సులకు ప్రసిద్ధి చెందాయి. అయితే, చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తమ విద్యకు ఆర్థిక సాయం కోసం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వసతి, ట్యూషన్‌ ఫీజులు, ఇతర రోజువారీ ఖర్చులు వంటి విద్య సంబంధిత ఖర్చులను సమర్థంగా నిర్వహించడానికి రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిదే. విద్యా రుణంపై సరసమైన వడ్డీ రేటుతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

బ్యాంకుల్లో విద్యారుణం (లేదా) వ్యక్తిగత రుణం విషయంలో తేడా ఏంటో ఇక్కడ చూడండి..

వ్యక్తిగత రుణం

మీ కోరిక మేరకు రుణ మొత్తాన్ని ఉపయోగించుకోవడానికి మీకు అనుమతి ఉంటుంది. తీసుకున్న డబ్బును విద్య, ట్యూషన్‌ ఫీజుకే కాకుండా పెళ్లి, ఇంటి పునరుద్ధరణ, వాహన కొనుగోలు, ప్రయాణాలు, ఇంకా మరిన్ని ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. తీసుకున్న రుణ మొత్తాన్ని వడ్డీతో సహా ఇచ్చిన గడువులోపు తిరిగి చెల్లించాలి. వ్యక్తిగత రుణానికి గ్యారంటీ హామీ, సెక్యూరిటీ అవసరం లేదు. తక్కువ డాక్యుమెంట్స్‌తో రుణం త్వరగా అందుతుంది.

విద్యా రుణం

విద్యా రుణం అనేది విద్యార్థులు తమ విద్యకు సంబంధించిన ఖర్చులను చెల్లించడానికి దరఖాస్తు చేసుకునే రుణం. అనేక బ్యాంకులు, NBFCలు పోటీ రేట్లతో విద్యా రుణాలను అందిస్తున్నాయి. ఇవి, ఔత్సాహిక విద్యార్థులు భారతదేశంలో లేదా విదేశాలలో నాణ్యమైన విద్యను పొందాలనే కలను నెరవేరుస్తాయి. ఈ రుణాలు రెండు రకాలు..

స్వదేశీ విద్యా రుణం

భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది అనుకూలంగా ఉంటుంది. రుణగ్రహీత భారతీయ విద్యా సంస్థల్లో నమోదు చేసుకుని, ఇతర అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మాత్రమే బ్యాంకు రుణాన్ని ఆమోదిస్తుంది.

ఓవర్సీస్‌(విదేశీ) విద్యా రుణం

భారతదేశం వెలుపల కోర్సు లేదా స్టడీ ప్రోగ్రామ్‌ను ఎంచుకునే విద్యార్థులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఒక విద్యార్థి విదేశీ కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో సీటు పొందినట్లయితే ఈ రుణానికి అర్హులు. ఈ రుణం ట్యూషన్‌ ఫీజు, వసతి, విమాన ఛార్జీలు మొదలైనవాటిని కవర్‌ చేస్తుంది.

ఫండ్‌ కవరేజీ

మీ విదేశీ విద్య కోసం సరైన రకమైన రుణాన్ని ఎంచుకోవడంలో రుణ కవరేజీ ఒక కీలకమైన అంశం. ఈ అంశంలో విద్యా రుణాలు చాలా మెరుగ్గా ఉంటాయి అని చెప్పొచ్చు. రూ.7.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు రుణాన్ని పొందొచ్చు. అదే వ్యక్తిగత రుణం అయితే, తీసుకునే మొత్తం గరిష్ఠంగా రూ.25 లక్షలు కావచ్చు. అసాధారణ విషయంలో బ్యాంకు విచక్షణను బట్టి రూ.40 లక్షల వరకు పెరగొచ్చు. విదేశీ విద్యను ఆశిస్తున్నట్లయితే ఇలాంటి రుణ పరిమితి సందర్భంలో విద్యా రుణమే మంచి ఎంపిక.

వడ్డీ రేటు

విద్యా రుణాలపై వడ్డీ రేటు 8.30% (గ్యారంటీ ఉంటే) నుంచి 11% వరకు (గ్యారంటీ లేకుండా) ఉంటుంది. అదే వ్యక్తిగత రుణం అయితే, 11% నుంచి 24% మధ్య వడ్డీ రేట్లు ఉంటాయి. అంతేకాకుండా, మహిళా విద్యార్థి అయితే విద్యా రుణంపై 0.50% రాయితీని పొందొచ్చు. ఈ రాయితీ వ్యక్తిగత రుణాల్లో సాధ్యం కాదు.

మారటోరియం వ్యవధి

వ్యక్తిగత రుణం తీసుకున్నప్పుడు రుణ పంపిణీ జరిగిన వెంటనే రీపేమెంట్‌ వ్యవధి ప్రారంభమవుతుంది. కానీ, విద్యా రుణంలో విద్యార్థి తన చదువును పూర్తి చేసి సంపాదించడం ప్రారంభించిన తర్వాత చెల్లింపులు మొదలు పెట్టొచ్చు. మారటోరియం వ్యవధి మొత్తం కోర్సు కాలవ్యవధితో పాటు 6/12 నెలల పాటు వర్తిస్తుంది. ఇక్కడ రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించడానికి..నిధుల నిర్వహణనకు తగిన సమయం ఉంటుంది.

పన్ను మినహాయింపు

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 80E ప్రకారం.. విద్యా రుణంకోసం  చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ సెక్షన్‌ కింద, విద్యార్థులు చెల్లింపులు ప్రారంభించిన తేదీ నుంచి 8 సంవత్సరాల వరకు పన్ను మినహాయింపులను పొందొచ్చు.

రుణం చెల్లించే కాలపరిమితి

వ్యక్తిగత రుణానికి గరిష్ఠంగా 5 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంటుంది. విద్యా రుణంలో కాలవ్యవధి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈఎంఐ నిర్వహణ విషయంలో విద్యార్థులకు ఎక్కువ కాలవ్యవధి ఉండడం వల్ల ఎక్కువ ఒత్తిడి ఉండదని చెప్పొచ్చు.

చివరిగా: రుణ మొత్తం, వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపులు, ఈఎంఐ కాలవ్యవధి.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, విద్యకు.. విద్యా రుణమే మంచిది అని చెప్పగలం. అయితే, కొన్ని సందర్భాల్లో గుర్తింపు లేని కళాశాలను ఎంచుకున్నా లేక క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంకులు విద్యా రుణం తిరస్కరించవచ్చు. ఇలాంటప్పుడు వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని