Personal Finance: ఖర్చు.. తగ్గించుకుందామిలా

అవసరానికి ఖర్చు చేయడం తప్పదు. కొన్నిసార్లు శక్తికి మించి వ్యయాలు చేసేస్తుంటాం. విసుగు, ఒత్తిడిని ఎదుర్కొనేందుకూ ఏదో ఒకటి కొనేస్తుంటారు.

Updated : 02 Jun 2023 12:37 IST

అవసరానికి ఖర్చు చేయడం తప్పదు. కొన్నిసార్లు శక్తికి మించి వ్యయాలు చేసేస్తుంటాం. విసుగు, ఒత్తిడిని ఎదుర్కొనేందుకూ ఏదో ఒకటి కొనేస్తుంటారు. సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్నామని చాటి చెప్పడం, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం, భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం వంటివీ అధిక ఖర్చుకు కారణం అవుతుంటాయి. ఇలాంటి అలవాటు నుంచి బయటపడే మార్గం ఏది? తెలుసుకుందాం.

చాలామంది పొదుపు, మదుపులను సరిగా అర్థం చేసుకోరు. ఖర్చులు పోను మిగిలిందే పొదుపు చేసినట్లు అనే భావనలో ఉంటారు. వాస్తవం వేరు. మీ సంపాదనలో నుంచి కొంత మొత్తం పొదుపు చేయాలి. ఆ తర్వాతే ఖర్చు చేయాలి. ఇలా చేయడం వల్ల డబ్బు వృథాను అరికట్టవచ్చు. మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడులు, బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్లు ఇందుకోసం ఉపయోగపడతాయి. పొదుపు చేసిన డబ్బును నిజంగా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవచ్చు. పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ డబ్బు పెరుగుతూ ఉంటుంది. వెనక్కి తీసుకోవాలనుకుంటే.. కొన్ని రుసుములు చెల్లించాల్సి రావచ్చు. రాబడి అందుతుండటం, జరిమానాలు, పన్నుల వల్ల పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఆలోచిస్తారు. ప్రత్యామ్నాయంగా ఖర్చులను వాయిదా వేయడం లేదా తగ్గించుకోవచ్చు.


వ్యూహాత్మకంగా..

మీ డబ్బుతో ఆనందం పొందాలనుకోవడంలో తప్పు లేదు. అది మీ కష్టార్జితం. దాన్ని ఆస్వాదించండి. కానీ, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కొన్ని స్వీయ నిబంధనలు విధించుకోండి. 50:30:20 నియమం పాటించేందుకు ప్రయత్నించండి.
ఇంటి అద్దె, కిరాణా సామగ్రి, ఇతర నిత్యావసరాల కోసం 50 శాతం కేటాయించండి. మీ కోరికలు అంటే విహార యాత్రలు, ఇతర అవసరాల కోసం 30 శాతం కేటాయించుకోండి. మిగతా 20 శాతాన్ని పొదుపు, పెట్టుబడులకు మళ్లించండి. కోరికల కోసం 30 శాతం అవసరం లేదు అనుకుంటే.. దాన్ని మరింత తగ్గించుకొని, పొదుపు శాతం పెంచండి.


ఆలస్యం చేయండి..

ఒక వస్తువును చూడగానే వెంటనే కొనాలనిపిస్తుంది. చాలామటుకు అధిక వ్యయానికి కారణం ఇదే. క్రెడిట్‌ కార్డు చేతిలో ఉన్నప్పుడు ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. తీరా బిల్లు చెల్లించాల్సి వచ్చిన రోజున, అనవసరంగా కొన్నాం అని అనుకుంటాం. ఆకస్మిక వ్యయాలను ఎదుర్కొనేలా మన మనసును సిద్ధం చేసుకోవాలి. ఏదైనా కొనాలనుకున్నప్పుడు దాని గురించి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. కనీసం వారమైనా దాని గురించి ఆలోచించాలి. ఆలోపు దాని అవసరం ఎంత మేరకు ఉండొచ్చు? లేకపోవడం వల్ల నష్టమేమైనా ఉందా? లాంటివి పరిశీలించండి. అప్పటికీ కొనాలి అనిపిస్తే ముందడుగు వేయండి.


సలహా తీసుకోవాలి..

చిన్న మొత్తాన్ని జమ చేయాలంటే.. కొన్ని నెలలు పడుతుంది. అదే ఖర్చు చేయాలంటే క్షణం చాలు. మనలో చాలామందికి ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉందనే చెప్పాలి. మంచి ఆర్థిక సలహాదారుల కొరతా ఉంది. విహార యాత్రలు, విపరీతంగా కొనుగోళ్లు చేసే ధోరణి మీ పొదుపు మొత్తాన్ని హరించి వేసే శత్రువులు. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంచి ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. పెట్టుబడులు పెడుతున్నప్పుడూ నిపుణులను సంప్రదించడం మంచిది. దీనివల్ల అనవసరమైన ఖర్చులకు కళ్లెం పడుతుంది.


ఇతరుల అలవాట్లు..

మన చుట్టూ ఉన్న వారి అలవాట్లను మనం అనుకరిస్తాం. ఉదాహరణకు మన బంధువులు, స్నేహితులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారనుకుందాం. వారి ప్రభావంతో మనమూ ఏదో ఒకటి కొనేందుకు ప్రయత్నిస్తుంటాం. కాబట్టి, డబ్బు గురించి పూర్తి అవగాహన, పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చే వారితో తరచూ మాట్లాడుతూ ఉండాలి. వారు ఏం చేస్తున్నారన్నది గమనించాలి. ఫలితంగా డబ్బు విషయంలో మనకూ ఒక స్పష్టత వస్తుంది.


అప్పులు చేస్తుంటే..

రుణాలు ఎప్పుడూ కొన్ని క్లిక్‌ల దూరంలోనే ఉంటాయి. చెడు ఖర్చులు రుణాలను తీసుకునే అలవాటును పెంచుతాయి. మన చుట్టూ ఉన్న వ్యక్తులను మెప్పించాల్సిన అవసరం లేదు. ఆస్తులను పెంచుకునేందుకు చేసే అప్పు మంచిదే. కానీ, ఇస్తున్నారు కదా అని రుణాలు తీసుకుంటే.. అప్పుల కుప్ప తయారవుతుంది. వాయిదాలు చెల్లించేందుకే మొత్తం సంపాదన సరిపోతుంది. వడ్డీలు భారం అవుతాయి. అప్పలతో జీవన శైలి ఖర్చులు చేయడం ఎప్పుడూ మంచిది కాదు. క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్లు చేసినప్పుడు మీ బాకీని సకాలంలో చెల్లించేయండి.


చివరగా.. మీ నియంత్రణలో లేని ఖర్చులు కొన్ని ఉంటాయి. అనారోగ్యం, ప్రమాదం, మరణంలాంటి విపత్తులు ఏ క్షణమైనా రావచ్చు. వీటిని తట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఆర్జించే ప్రతి వ్యక్తీ అవసరాన్ని బట్టి, బీమా పాలసీలు తీసుకోవడం వల్ల పొదుపు మొత్తం ఖర్చు కాకుండా ఉంటుంది.

అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు