Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విక్రయాల్లో బిగ్‌జంప్‌.. గతేడాది కంటే 65 శాతం వృద్ధి

ప్రముఖ వాహన తయారీ సంస్థ ఐషర్‌ మోటార్స్‌ (Eicher Motors) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.657 కోట్ల నికర లాభాన్ని (పన్ను అనంతరం) నమోదు చేసింది.

Published : 10 Nov 2022 19:29 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఐషర్‌ మోటార్స్‌ (Eicher Motors) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.657 కోట్ల నికర లాభాన్ని (పన్ను అనంతరం) నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే లాభం 76 శాతం మేర పెరిగింది. గతేడాది ఇదే కాలంలో ఆ కంపెనీ రూ.373 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం రూ.2,250 కోట్ల నుంచి రూ.3,519 కోట్లకు పెరిగినట్లు ఐషర్‌ మోటార్స్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దేశీయ మార్కెట్‌తో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో చురుకైన అమ్మకాలు ఇందుకు దోహదపడ్డాయి.

కంపెనీకి చెందిన ద్విచక్రవాహన విభాగమైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మెరుగైన విక్రయాలు సాధించింది. క్యూ2లో మొత్తం 2,03,451 మోటార్‌సైకిళ్లను ఆ కంపెనీ విక్రయించింది. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 65 శాతం మేర పెరగడం గమనార్హం. పండగ విక్రయాల్లో మంచి వృద్ధి నమోదైందని, ఇదే ట్రెండ్‌ వచ్చే త్రైమాసికంలో సైతం కొనసాగుతందని ఆశిస్తున్నట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీఈఓ బి.గోవిందరాజన్‌ తెలిపారు. కంపెనీ షేరు విలువ బీఎస్‌ఈలో గురువారం 0.83 శాతం క్షీణించి రూ.3702 వద్ద ముగిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని