ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ విక్రయాల్లో బిగ్‌ జంప్‌.. తొలిసారి లక్ష మార్కు

Electric 2 wheeler sales data: దేశీయ విద్యుత్‌ ద్విచక్ర వాహనాల విక్రయాలు మే నెలలో తొలిసారి లక్ష మార్కు దాటాయి. సబ్సిడీలో కోత వల్ల విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated : 02 Jun 2023 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయంగా విద్యుత్‌ వాహన విక్రయాలు (EV sales) ఒక్కసారిగా పెరిగాయి. మే నెలలో లక్ష మార్కును దాటాయి. ఈ స్థాయిలో విద్యుత్‌ వాహన విక్రయాలు జరగడం ఇదే తొలిసారి. విద్యుత్‌ టూవీలర్లకు కేంద్రం ఇచ్చే సబ్సిడీలో కోత (subsidy cut) కారణంగా చివరి నిమిషంలో వినియోగదారులు పోటీ పడడం విక్రయాలు పెరగడానికి కారణమని తెలుస్తోంది.

దేశీయంగా మే నెలలో విద్యుత్‌ వాహన అమ్మకాలు 1.04 లక్షల యూనిట్లుగా నమోదైనట్లు ప్రభుత్వ వాహన్‌ పోర్టల్‌ డేటా ద్వారా వెల్లడైంది. ఏప్రిల్‌ నెలతో అమ్ముడైన 66,727 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 57 శాతం అధికం. గతేడాది మే నెలతో (42,415) పోలిస్తే ఈ మొత్తం 147 శాతం మేర పెరగడం విశేషం. జూన్‌ 1 నుంచి వాహన ధరలు పెరుగుతాయని తెలియడంతో చివరి 10 రోజుల్లో భారీగా వాహన విక్రయాలు జరిగాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ వాహనాల్లో తక్కువ వేగం కలిగిన వాహనాలను, కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను మినహాయించారు. లేదంటే ఈ సంఖ్య మరింత అధికంగా ఉండేది.

విద్యుత్‌ స్కూటర్లకు ఒక్కో కిలోవాట్‌ అవర్‌ (KWh)కు గతంలో రూ.15,000 సబ్సిడీ ఉండేది. ఈ సబ్సిడీని రూ.10,000కు పరిమితం చేశారు. ఎక్స్‌ ఫ్యాక్టరీ ధరపై ప్రోత్సాహకాలు ఇప్పటివరకు 40 శాతంగా ఉండగా.. వాటిని 15 శాతానికి తగ్గించారు. దీంతో  టీవీఎస్‌ మోటార్‌, ఏథర్‌ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్‌ తమ విద్యుత్తు స్కూటర్ల ధరలను తాజాగా పెంచాయి. తమ ఐక్యూబ్‌ స్కూటర్‌ ధరలు వేరియంట్‌ను బట్టి రూ.17,000-22,000 వరకు పెరగనున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ తెలిపింది. 450ఎక్స్‌ ధర రూ.8,000 వరకు పెరిగినట్లు ఏథర్‌ ఎనర్జీ పేర్కొంది. ఓలా విక్రయిస్తున్న వివిధ మోడళ్ల ధరలు రూ.15,000 వరకు పెరిగాయి. హీరో ఎలక్ట్రిక్‌ మాత్రం తమ ఇ-స్కూటర్‌ మోడళ్ల ధరలను పెంచడం లేదని ప్రకటించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు