Electric 2-Wheelers: విద్యుత్‌ ద్విచక్ర వాహన విక్రయాల్లో రెండున్నర రెట్ల వృద్ధి

Electric 2-Wheelers: ఈ ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్‌ నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువ విద్యుత్‌ ద్విచక్ర వాహన విక్రయాలు జరిగినప్పటికీ.. క్రితం ఏడాదితో పోలిస్తే మాత్రం అమ్మకాలు రెండున్నర రెట్లు పెరగడం గమనార్హం. 

Updated : 11 Apr 2023 08:52 IST

దిల్లీ: దేశంలో విద్యుత్‌ ద్విచక్ర వాహన విక్రయాలు (Electric two-wheeler sales) 2022-23లో రెండున్నర రెట్లు పెరిగాయి. 2021-22లో 3,27,900 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. గత ఏడాది ఆ సంఖ్య 8,46,976 యూనిట్లకు చేరింది. ఈ వివరాలను తయారీ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ‘విద్యుత్తు వాహన తయారీదారుల సొసైటీ (SMEV)’ సోమవారం వెల్లడించింది.

గంటకు 25 కి.మీ కంటే తక్కువ వేగం కలిగిన ఇ-స్కూటర్లు 2022-23లో 1.2 లక్షలు అమ్ముడైనట్లు ఎస్‌ఎంఈవీ పేర్కొంది. క్రితం సంవత్సరం ఈ సంఖ్య 75,457 యూనిట్లుగా నమోదైంది. మరోవైపు గంటకు 25 కి.మీ కంటే ఎక్కువ వేగంతో నడిచే విద్యుత్‌ ద్విచక్ర వాహన విక్రయాలు గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 7,26,976 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఈ విక్రయాలు 2,52,443గా ఉన్నాయి. మొత్తంగా 2022- 23లో నీతి ఆయోగ్‌ సహా ఇతర పరిశోధక సంస్థలు నిర్దేశించిన లక్ష్యం కంటే 25 శాతం తక్కువ విద్యుత్‌ ద్విచక్ర వాహన విక్రయాలు నమోదయ్యాయి.

పీఎంపీ మార్గదర్శకాలను పాటించనందున కొన్ని కంపెనీలకు ఫేమ్‌-II రాయితీని ఉపసంహరించడం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు ఎస్‌ఎంఈవీ పేర్కొంది. అయితే, వినియోగదారుల వైపు నుంచి మాత్రం గిరాకీ తగ్గలేదని తెలిపింది. రాయితీల విషయంలో నెలకొన్న వివాదం పరిష్కారమైతే విక్రయాలు తిరిగి పుంజుకుంటాయని పేర్కొంది. అలాగే ఫేమ్‌ పథకాన్ని కొనసాగించడంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే పూర్తి విద్యుత్‌ వాహన పరిశ్రమ భవిష్యత్‌ ఆధారపడి ఉందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని