Electric Two Wheelers: 4 నెలల కనిష్ఠానికి విద్యుత్‌ ద్విచక్ర వాహన విక్రయాలు

Electric Two Wheelers: ప్రభుత్వం రెండు తయారీ సంస్థలపై తీసుకున్న కఠిన చర్యల కారణంగా విద్యుత్‌ ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్‌లో పడిపోయాయి.

Published : 01 May 2023 16:30 IST

దిల్లీ: ఏప్రిల్‌లో విద్యుత్‌ ద్విచక్ర వాహన (Electric Two Wheelers) విక్రయాలు గణనీయంగా తగ్గాయి. వాహన్‌ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. మార్చిలో 82,292 యూనిట్లు అమ్ముడయ్యాయి. అవి ఏప్రిల్‌లో 62,581 యూనిట్లకు తగ్గాయి. రెండు ప్రధాన కంపెనీలపై కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల విభాగం తీసుకున్న కఠిన చర్యల కారణంగానే విక్రయాలు పడిపోయినట్లు నిపుణులు విశ్లేషించారు.

విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలైన ఒకినావా, హీరో ఎలక్ట్రిక్‌, ఏథర్‌ ఎనర్జీ, టీవీఎస్‌ విక్రయాలు ఏప్రిల్‌లో నాలుగు నెలల కనిష్ఠానికి చేరాయి. ఒక్క ఓలా ఎలక్ట్రిక్‌ మాత్రం దీనికి మినహాయింపు. ఏప్రిల్‌లో ఓలా 21,560 యూనిట్లు విక్రయించింది. ఇది మార్చి కంటే అధికం. పైగా ఈ కేలండర్‌ ఏడాదిలో ఓలాకు ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం.

ఓ ప్రజావేగు ఇచ్చిన సమాచారం ప్రకారం.. హీరో ఎలక్ట్రిక్‌, ఒకినావాపై భారీ పరిశ్రమల విభాగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ ప్రయోజనాలను పొందడం కోసం విద్యుత్‌ వాహన తయారీ సంస్థలు 50 శాతం పరికరాలను స్థానికంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ, దీన్ని పైన తెలిపిన రెండు కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయన్నది ఆరోపణ. ఈ నేపథ్యంలో భారీ పరిశ్రమల విభాగం ఈ రెండు సంస్థలపై ఆడిట్‌ ఇన్వెస్టిగేషన్‌ చేపట్టింది. ఫలితంగా వీటి విక్రయాలు మార్చితో పోలిస్తే 43 శాతం పడిపోవడం గమనార్హం. దీంతో మొత్తం విద్యుత్‌ ద్విచక్ర వాహన విక్రయాల్లో ఈ రెండు సంస్థల వాటా నెల క్రితంతో పోలిస్తే 31 శాతం నుంచి 10 శాతానికి పడిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని