Price hike: సబ్సిడీలో కోత.. 1 నుంచి EVల ధరలకు రెక్కలు

Electric two wheelers: ఫేమ్‌-2 సబ్సిడీ కింద విద్యుత్‌ ద్విచక్ర వాహనదారులకు ఇచ్చే సబ్సిడీలో కేంద్రం కోత పెట్టింది. దీంతో ఆయా విద్యుత్‌ స్కూటర్ల ధరలు పెరగనున్నాయి.

Published : 23 May 2023 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు (Electric two wheelers) ఇచ్చే సబ్సిడీలో (Subsidy) కేంద్రం కోత పెట్టింది. ఫేమ్‌-2 పథకం (FAME-II ) కింద ఇచ్చే రాయితీ మొత్తాన్ని తగ్గించింది. దీంతో ఆ మేర విద్యుత్‌ వాహన ధరలు పెరగనున్నాయి. దీనివల్ల వినియోగదారులకు విద్యుత్‌ వాహనాల కొనుగోలు భారం కానుంది. దీనిపై విద్యుత్ వాహన పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తుండగా.. మరికొన్ని స్టార్టప్‌ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.

విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్‌ 1 నుంచి తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయంచింది. ఫేమ్‌-2 పథకం కింద ఇస్తున్న సబ్సిడీని 1 kWhకు రూ.5,000 మేర తగ్గిస్తున్నట్లు భారీ పరిశ్రమల శాఖ మంగళవారం నోటిఫికేషన్‌లో పేర్కొంది. గతంలో ఈ మొత్తం రూ.15 వేలుగా ఉండగా.. ఇకపై రూ.10,000కు తగ్గనుంది. అలాగే, ఒక్కో వాహనంపై గరిష్ఠ రాయితీ పరిమితి వాహన వ్యయంలో 40% వరకు పరిమితి ఉండగా.. ఇకపై ఆ మొత్తాన్ని వాహనాల ఎక్స్‌-ఫ్యాక్టరీ ధరలో 15 శాతానికి తగ్గననుంది. సవరించిన సబ్సిడీ 2023 జూన్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకునే అన్ని విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకూ వర్తిస్తుందని నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంతో వాహన ధరల పెరగనున్నాయి. సబ్సిడీ కోత ప్రభావం అటు కంపెనీలపైనా, ఇటు వినియోగదారులపైనా పడనుంది. ప్రస్తుతం 3kWh బ్యాటరీ కలిగిన ఒక విద్యుత్‌ స్కూటర్‌ ధర రూ.1 లక్ష అనుకుంటే.. సబ్సిడీ కింద ప్రస్తుతం రూ.40వేలు (గరిష్ఠ పరిమితికి 40 శాతానికి లోబడి) లభిస్తుంది. సవరించిన సబ్సిడీ మొత్తం అనంతరం ఈ మొత్తం కేవలం రూ.15వేలకే పరిమితం కానుంది. అంటే మిగిలిన రూ.25వేలు మొత్తం వినియోగదారుడే చెల్లించాలి. ఏథర్‌ వంటి సంస్థలు జూన్‌ 1 నుంచి ధరలు పెరగబోతున్నాయంటూ ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో బ్యానర్లను ప్రదర్శిస్తున్నాయి.

మరోవైపు పెరిగిన ధరల కారణంగా విద్యుత్‌ వాహనాలవైపు ఆసక్తి సన్నగిల్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏథర్‌, ఓలా, టీవీఎస్‌ వంటి కంపెనీల సేల్స్‌పై ప్రభావం చూపనుంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యుత్‌ వాహన తయారీదారుల సొసైటీ ఆందోళన వ్యక్తంచేసింది. సబ్సిడీలో కోత పెట్టడం వల్ల విద్యుత్‌ ద్విచక్ర వాహన కొనుగోళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో స్టార్టప్‌ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. విద్యుత్‌ వాహన పరిశ్రమ తన కాళ్లపై తాను నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని