Vehicle Insurance: మీకు ఎలక్ట్రిక్‌ వాహన బీమా గురించి తెలుసా?

ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కొనుగోలు చేసే ప్రతి యజమాని వాహన బీమా గురించి తెలుసుకోవాలి.

Published : 29 Aug 2023 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇప్పుడిప్పుడే జనాదరణను పొందుతున్నాయి. ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వే 2022-23 ప్రకారం దేశీయ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ 2022-2030 మధ్య 49% వార్షిక వృద్ధి రేటు (CAGR) పొందే అవకాశం ఉంది. వార్షిక అమ్మకాలు కూడా 2030 నాటికి 1 కోటి యూనిట్లకు చేరతాయని ఒక అంచనా. అయితే, అన్ని వాహనాల మాదిరిగానే ఎలక్ట్రిక్‌ వాహనాలకు కూడా మోటార్‌ బీమా వర్తిస్తుంది. ఒకవేళ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే చట్టానికి లోబడి కారు/బైక్‌ బీమా పాలసీని కొనుగోలు చేయాలి. భారత్‌లో EVలకు సంబంధించిన బీమా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాటరీ కవరేజ్‌

సంప్రదాయ ICE వాహనాలతో పోలిస్తే, ఎలక్ట్రిక్‌ వాహనాలు భిన్నంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ వాహనానికి బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు పాలసీ EV విడిభాగాలను కవర్‌ చేస్తుందో లేదా తనిఖీ చేయాలి. బ్యాటరీ, వాహనంలో కీలక అంతర్భాగమైనందున బీమా పాలసీలో దీని కవరేజీ చాలా ముఖ్యం. వాహన ధరలో ఇదే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, దొంగతనం, నష్టం జరిగినప్పుడు, ఊహించని మరమ్మతులు వచ్చినప్పుడు.. మీ బీమా పాలసీ ఖరీదైన బ్యాటరీ ప్యాక్‌ కవరేజీని అందిస్తుందో లేదో తెలుసుకోండి. బీమాకు ముందు బ్యాటరీకి సంబంధించిన నిబంధనలు, షరతులను సమీక్షించండి.

ప్రత్యేక మరమ్మతు నెట్‌వర్క్‌

ఎలక్ట్రిక్‌ వాహనాలను రిపేర్‌ చేయడానికి ప్రత్యేక సాంకేతికత అవసరం. చాలావరకు బయట గ్యారేజ్‌లలో EVలు రిపేర్‌ చేసే మెకానిక్‌లు ప్రస్తుతం తగినంతగా లేరు. EV కంపెనీలు.. మోటారు డీలర్ల వద్ద పనిచేసే వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. అందుచేత EV మరమ్మతులను నిర్వహించగల సామర్థ్యంతో టై-అప్‌లను కలిగి ఉన్న బీమా ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.

బీమా విలువ

మీ ఎలక్ట్రిక్‌ వాహన బీమా విలువను లెక్కించేటప్పుడు వాహన ధర, బ్యాటరీ, అదనపు ఉపకరణాలు, వాహనానికి చేసిన మార్పులు వంటి అంశాలను పరిగణించండి. మీ EV మొత్తం విలువను సరిగ్గా లెక్కించడం ద్వారా దొంగతనం, నష్టానికి తగినంతగా కవరేజ్‌ ఉందని నిర్ధారించుకోండి. సాధారణంగా వాహనం విలువ కాలక్రమేణా క్షీణిస్తుంది. కాబట్టి, బీమా విలువను క్రమం తప్పకుండా తిరిగి అంచనా వేయండి.

ఛార్జింగ్‌ పరికరాల కవరేజ్‌

EVలు ఛార్జింగ్‌తో నడుస్తాయి. కాబట్టి, ఈ వాహనాలకుండే ఛార్జింగ్‌ పరికరాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ పరికరాలకు బీమా వర్తిస్తుంది. ఛార్జింగ్‌ స్టేషన్‌లలో సంభవించే నష్టాలకు, కోల్పోయిన ఛార్జింగ్‌ కేబుళ్లకు కవరేజ్‌ ఉంటుంది. ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలతో సహా కవరేజీ పొందొచ్చు.

IDV

వాహనం పూర్తిగా నష్టపోయినా లేదా చోరీకి గురైనా బీమా కంపెనీ అందించే గరిష్ట పరిహారాన్ని ఇన్స్యూర్డ్ డిక్లేర్డ్‌ వాల్యూ (IDV) అంటారు. మీ వాహనానికి తక్కువ బీమా చేయవద్దు. అలా చేస్తే చోరి లేదా మరమ్మతు చేయలేని నష్టం జరిగినప్పుడు మీరు ఆ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. వాహన యజమానిగా థర్డ్‌ పార్టీతో పాటు సమగ్ర ప్లాన్‌ పొందాలి. దీనివల్ల మీ వాహనానికి జరిగిన నష్టం, చట్టపరమైన బాధ్యత రెండింటికీ కవరేజ్‌ లభిస్తుంది.

థర్డ్‌ పార్టీ బీమా

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ప్రతి మోటారు, ఎలక్ట్రిక్‌ వాహనం తప్పనిసరిగా థర్డ్‌-పార్టీ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి. ఈ బీమా ఉన్నట్లయితే, వాహనం వల్ల 3వ వ్యక్తి/ఆస్తికి నష్టం వాటిల్లినప్పుడు.. బీమా కంపెనీ ఖర్చులను భరిస్తుంది. ప్రస్తుతం 65 KW (కిలో వాట్‌) కంటే ఎక్కువ ఉన్న ఎలక్ట్రిక్‌ కారు కోసం థర్డ్‌-పార్టీ బీమా పాలసీ ధర రూ.6,750గా ఉంది. 30-65 KW వాహనానికి రూ.2,750గా ఉంది. 30 KW కంటే తక్కువ ఉన్న వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా ధర రూ.1,775గా ఉంది. ఎంచుకున్న మోడల్‌, యాడ్‌-ఆన్‌లను బట్టి, వివిధ బీమా సంస్థలు సమగ్ర బీమా పాలసీల కోసం వేర్వేరు ప్రీమియంలను వసూలు చేస్తాయి.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు

కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు EV బీమా ప్రీమియంపై ప్రత్యేక ప్రయోజనాలు, తగ్గింపులను అందిస్తాయి. మీ బీమా ఖర్చులను తగ్గించుకోవడానికి వీటిని సద్వినియోగం చేసుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని