Updated : 11 Jul 2022 18:25 IST

Electric Vehicles: ఈవీలు వాడుతున్నారా.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్తు వాహనాల (Electric Vehicles)కు భారత్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. 2021-22లో ఈవీల విక్రయాలు మూడింతలు పెరిగాయి. 2022లో ఇప్పటివరకూ నాలుగు లక్షలకు పైగా విక్రయాలు జరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 257 శాతం వృద్ధి నమోదైంది. భారత్‌లో ఈవీ (EV)లకు గిరాకీ పుంజుకుంటోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

విద్యుత్తు వాహనాల (Electric Vehicles)ని కొంటే సరిపోదు. వాటి నిర్వహణ తెలిసుండాలి. తరచూ తనిఖీలు చేయాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈవీ (EV)ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. భారీ వర్షాలు, వరదలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రత్యేక నిర్వహణ అవసరమవుతుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమస్యలకు పరిష్కారాలేంటో చూద్దాం..

షార్ట్‌ సర్క్యూట్‌..

వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు సహజం. విద్యుత్తు వాహనాలను (Electric Vehicles) ఛార్జ్‌ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తడిసిన ఛార్జింగ్‌ పోర్ట్‌, ప్లగ్‌ వల్ల కరెంటు సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించే అవకాశం ఉంది. ఇది లోపల సర్క్యూట్స్‌తో పాటు బ్యాటరీని డ్యామేజ్‌ చేసే ప్రమాదం ఉంది. నీళ్లు, తడి చేరని ప్రదేశాల్లో ఛార్జింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని ఎప్పుడూ ఓ కవర్‌తో కప్పి ఉంచాలి. ఛార్జర్‌ ప్లగ్‌, పోర్టుని శుభ్రంగా ఉంచాలి. అవి తడవకుండా జాగ్రత్తపడాలి. భారీ ఉరుములు, మెరుపులు ఉన్న సమయాల్లో ఛార్జింగ్‌ పెట్టకపోవడమే మంచిది!

పరికరాల్లోకి నీరు చేరడం..

వర్షాకాలంలో రోడ్లపై గుంతల్లో నీళ్లు నిలుస్తుంటాయి. అందులో నుంచి ఈవీ వెళ్లినప్పుడు పరికరాల్లోకి నీరు చేరుతుంటుంది. అయితే, బ్యాటరీ సహా ఇతర ఎలక్ట్రిక్‌ పరికరాలకు వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉంటుంది. అయితే, దానికి ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిధి దాటితే ప్రమాదం తప్పదు. సాధారణంగా ఈవీల్లోని బ్యాటరీ సహా ఇతర పరికరాలు ఐపీ67 వాటర్‌ రెసిస్టెన్స్‌ ప్రమాణంతో వస్తున్నాయి. అంటే ఈవీని నీటిలో ఒక మీటరు లోపల 30 నిమిషాల వరకు ఉంచినా ఎలాంటి ప్రమాదం ఉండదు. వీలైనంత వరకు పెద్ద ఎత్తున నీళ్లు నిలిచి ఉండే మార్గాల నుంచి వెళ్లకపోవడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరై వెళ్లినా.. వెంటనే తనిఖీ చేసుకొని తగు చర్యలు తీసుకోవాలి.

వైరింగ్‌ జాగ్రత్త..

ఈవీ (EV)ల్లో ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ చాలా కీలకం. వాటిల్లో ఏమాత్రం డ్యామేజ్ జరిగినా ప్రమాదమే. వానాకాలంలో ఎలుకల వంటి చిన్న చిన్న జంతువులు వాహనాల్లోకి దూరే అవకాశం ఉంది. అవి గనక వైరింగ్‌ను కట్‌ చేస్తే ఇబ్బంది తప్పదు. వాహన పరికరాల్లోకి దుమ్ము చేరడం, గాల్లో తేమ, రోజుల తరబడి ముసుర్లు వర్షాకాలంలో సర్వసాధారణం. దీనివల్ల ఎలక్ట్రికల్‌ కనెక్టర్లు, వైర్లు తుప్పు పడుతుంటాయి. రంగు వేయని ఇతర భాగాలు సైతం దెబ్బతింటుంటాయి. ఈవీలను తడిచేరని ప్రదేశాల్లో పార్క్‌ చేయాలి. ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచితే ఎలుకలు వంటివి ఉండవు. కార్ల విషయానికి వస్తే అద్దాలను ఎప్పుడూ మూసి ఉంచాలి. లోపల తడి, తేమ లేకుండా చూసుకోవాలి. షెడ్లు, గ్యారేజ్‌లలో పార్క్‌ చేయాలి. వాటర్‌ప్రూఫ్‌ కవర్లను కప్పాలి.

బ్యాటరీ పనితీరు..

చాలా వరకు ఈవీ (EV)ల్లో లిథియం-అయాన్‌ బ్యాటరీలను వినియోగిస్తుున్నారు. బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వీటిలో వేడి పెరుగుతుంటుంది. తగ్గుతుంటుంది. వర్షాకాలంలో నిరంతరాయంగా వర్షాలు కురిసిన సమయంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతుంటాయి. అట్లాంటి సమయంలో బ్యాటరీ పనితీరు, దాని ఉష్ణోగ్రతపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. ఈవీని వినియోగించిన గంట తర్వాతే ఛార్జింగ్‌ పెట్టాలి. ఫలితంగా బ్యాటరీ అప్పటికి చల్లబడుతుంది. ఈవీ వెంట వచ్చే ఒరిజినల్‌ ఛార్జర్లనే ఉపయోగించాలి. వీలైనంత వరకు స్లో ఛార్జింగ్‌కే మొగ్గుచూపాలి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని