Budget 2023: ఈవీలు వేగంగా రోడ్డెక్కాలంటే.. బడ్జెట్‌లో ఇవి ఉండాల్సిందే..!

Budget 2023: ఈవీ (Electric Vehicles) విక్రయాలు దేశంలో క్రమంగా పుంజుకుంటున్నాయి. మరోవైపు పర్యావరణహిత ప్రయాణ సౌకర్యాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్‌లో సర్కార్‌ ఈ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటించనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Updated : 23 Jan 2023 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యావరణ మార్పులపై పోరు ఉద్ధృతమవుతోంది. ఈ క్రమంలో విద్యుత్‌ వాహనాల (Electric Vehicles) వినియోగం పెరుగుతోంది. 2022లో ఈవీ విక్రయాల్లో 210 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం భారత రోడ్లపై 14 లక్షలకు పైగా ఈవీ (Electric Vehicles)లు తిరుగుతున్నాయి. పర్యావరణహిత ప్రయాణ వసతులకు ప్రభుత్వం సైతం తనవంతుగా ప్రోత్సాహం అందిస్తోంది. అయినప్పటికీ.. సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహన విక్రయాలదే ఇప్పటికీ పైచేయి. ఈ నేపథ్యంలో ఈవీ (Electric Vehicles)ల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌ (Budget 2023)లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించనుంది? ఈవీ పరిశ్రమ కొత్త పద్దు నుంచి ఏం కోరుకుంటోంది?

జీఎస్టీ తగ్గించాల్సిందే..

విద్యుత్‌ వాహన (Electric Vehicles) పరిశ్రమ మొట్టమొదట జీఎస్‌టీ తగ్గించడానికి బడ్జెట్‌ (Budget 2023)లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది. ముఖ్యంగా జొమాటో, బిగ్‌బాస్కెట్‌, అమెజాన్‌ వంటి సంస్థలు డెలివరీ కోసం ఉపయోగించే ఈవీలపై జీఎస్‌టీ తగ్గించాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ పన్ను భారం తగ్గితే వచ్చే రెండేళ్లలో డెలివరీ వాహనాలన్నీ ఈవీలుగా రూపాంతరం చెందుతాయని జిప్‌ ఎలక్ట్రిక్‌ సహ- వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాశ్‌ గుప్తా తెలిపారు.

మరోవైపు ఈవీ (Electric Vehicles)ల తయారీలో కీలకమైన బ్యాటరీలపైనా పన్ను తగ్గాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బ్యాటరీ ‘సెల్స్‌’ తయారీ భారత్‌లో ఊపందుకునే వరకు వీటి దిగుమతిపై సుంకం తొలగించాలని కోరుతున్నారు. ముఖ్యంగా అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌పై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. అలాగే విడిభాగాలను సైతం 5 శాతం జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

బడ్జెట్‌ 2022- 23లో విద్యుత్తు (Electric Vehicles) వాహనాల ను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఫేమ్‌-II పథకం కింద రూ.10,000 కోట్ల ఆర్థిక ప్రోత్సహకాలకు ప్రకటించింది. మరోవైపు తయారీని పెంచడం కోసం కంపెనీలకు రూ. 44,038 కోట్లు విలువ చేసే ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల (PLI)ను సైతం ప్రకటించింది.

వాణిజ్య వాహనాలనూ రోడ్లెక్కించాలి..

ఇప్పటి వరకు ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు కేవలం ప్రయాణికుల వాహనాలపైనే దృష్టి సారించాయి. ఇకపై వాణిజ్య వాహనాలను సైతం వేగంగా విద్యుత్‌ (Electric Vehicles) వైపుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం వాణిజ్య ఈవీల కొనుగోలు కోసం ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ విధానాల్లో పెద్ద వాహనాలు, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మౌలికవసతులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇకపై వీటి ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు కోరుతున్నారు.

ఫేమ్‌-IIను పొడిగించాలి..

‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (FAME-II) రెండో దశ ప్రోత్సాహకాలను మరికొంత కాలం పొడిగించాలని ఈవీ తయారీ కంపెనీలు కోరుతున్నాయి. ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్స్‌ సహా అన్ని విద్యుత్‌ వాహనాల (Electric Vehicles)కు కిలోవాట్‌కు రూ.15,000 చొప్పున డిమాండ్‌ ప్రోత్సాహాకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్‌ ద్విచక్రవాహనాల మొత్తం ధరలో రాయితీ పరిమితి 40 శాతంగా ఉంది. దీన్ని 2024 మార్చి 31 తర్వాత కూడా కొనసాగించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. రాయితీ నేరుగా వినియోగదారులకు అందేలా మార్పులు చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఫేమ్‌-2ను దశలవారీగా లైట్‌ మోటార్‌, మీడియం, హెవీ వాహనాలు, ట్రాక్టర్లకు కూడా విస్తరించాలని కోరుతున్నారు.

ఛార్జింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటుకు..

ఈవీల కొనుగోలుకు ప్రస్తుతం ఉన్న ప్రధాన అడ్డంకి ఛార్జింగ్‌ మౌలిక వసతులు. పెట్రోల్‌ పంపుల తరహాలో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు కూడా విరివిగా అందుబాటులోకి వస్తే ఈవీలను కొనడానికి ప్రజలు ముందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కావాల్సిన మూలధన వ్యయంలో 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పన్ను ఆధారిత డిమాండ్లు..

ప్రస్తుతం విద్యుత్‌ వాహనాల (Electric Vehicles) కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీపై గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. 2023 మార్చి 31 వరకు తీసుకునే రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించాలని కోరుతున్నారు. విద్యుత్‌ కార్లను కొనుగోలు చేసేవారికి కొనుగోలు చేసిన సంవత్సరంలోనే ఒకేసారి పన్ను మినహాయింపును ఇచ్చే విషయాన్ని కూడా పరిగణించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు