EVeium: జహీరాబాద్‌లో ఈవియం ఇ స్కూటర్ల తయారీ

యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న మెటా4 గ్రూప్‌నకు చెందిన వాహన తయారీ సంస్థ ఎలిషియం ఆటోమోటివ్స్‌ భారత్‌లో ఈవియం పేరిట విద్యుత్తు స్కూటర్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది....

Published : 22 Jun 2022 12:56 IST

 

ముంబయి: యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న మెటా4 గ్రూప్‌నకు చెందిన వాహన తయారీ సంస్థ ఎలిషియం ఆటోమోటివ్స్‌ భారత్‌లో ఈవియం పేరిట విద్యుత్తు స్కూటర్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఒక నెల వ్యవధిలో భారత్‌లో తయారైన మూడు స్కూటర్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ స్కూటర్లను తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న వోల్ట్‌లీ ఎనర్జీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. వోల్ట్‌లీ ఇటీవలే ద్విచక్ర విద్యుత్‌ వాహనాల పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం రూ.250 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ పరిశ్రమకు జహీరాబాద్‌లో 15 ఎకరాలు కేటాయించినట్లు స్వయంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

గతంలో భారత్‌లో ఎలిషియం బ్రిటన్‌కు చెందిన వన్‌ మోటోను ప్రమోట్‌ చేసేది. ఇకపై ఈవియం పేరిట విద్యుత్తు స్కూటర్లు, బైక్‌లు, సైకిళ్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తమ వాహనాల్లో సొంత టెలిమేటిక్స్‌ యాప్‌, డిజి-లాకర్‌, దగ్గర్లోని ఛార్జింగ్‌ స్టేషన్‌, జియో ఫెన్సింగ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉంటాయని తెలిపింది. ఇప్పటికే డీలర్లతో చర్చలు ప్రారంభించినట్లు పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో తమ వాహనాలను విక్రయించనున్నట్లు తెలిపింది. తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని