Elon Musk: ట్విటర్‌ ఉద్యోగులకు మస్క్‌ బంపర్‌ ఆఫర్‌!

ఉద్యోగుల తొలగింపు, ట్విటర్‌ (Twitter) వెరిఫికేషన్‌ నగదు వసూలు అంటూ వరుస షాకిలిస్తున్న ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. తాజాగా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. 

Published : 26 Mar 2023 21:44 IST

కాలిఫోర్నియా: ట్విటర్‌ (Twitter) సీఈవో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నిర్ణయాలు ఉద్యోగులతోపాటు, వినియోగదారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గతేడాది అక్టోబరులో  ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ట్విటర్‌ వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ కోసం డబ్బులు చెల్లించాలని యూజర్లకు షాకిచ్చారు. ఇలా ఉద్యోగులు, వినియోగదారులకు వరుస షాకిలిస్తూ వస్తోన్న మస్క్‌, తొలిసారి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. బాగా పనిచేసిన ఉద్యోగులకు ప్రోత్సహకంగా ట్విటర్‌ షేర్లు ఇస్తానని ప్రకటించినట్లు సంస్థ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఈ మేరకు సంస్థలోని ఉద్యోగులందరికీ మస్క్ ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం పంపినట్లు తెలిపింది. వీటి విలువ సుమారు 20 బిలియన్‌ డాలర్లు. ఇది ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు వెచ్చించిన మొత్తంలో సగం. మస్క్‌, 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

మస్క్‌ తాజా నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని పలువురు మాజీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, మస్క్‌పై అసంతృప్తితో నైపుణ్యం కలిగిన సిబ్బంది కూడా రాజీనామా చేస్తుండటంతో వారిని ఆపేందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు. అలానే ఈ షేర్లు ఏ స్థాయిలోని ఉద్యోగులకు కేటాయిస్తారనేది కూడా వెల్లడించలేదు. అలానే, ఉద్యోగులకు కేటాయించిన షేర్లను నాలుగేళ్ల తర్వాత అమ్ముకోవచ్చని తెలిపారు.

ఆఫీస్‌కు రావాల్సిందే..మరో ఆప్షన్‌ లేదు

అంతకముందు ఉద్యోగులకు మస్క్‌ మరో మెయిల్‌ కూడా పంపారని సమాచారం. అర్థరాత్రి 2:30 గంటలకు పంపిన మెయిల్‌లో ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని స్పష్టం చేశారట. కొద్దిరోజుల క్రితం శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ కార్యాలయంలో సగం మంది ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ చేశారు. దీంతో కార్యాలయం ఖాళీగా ఉందని మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారట.ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్‌ ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఉద్యోగి వారంలో కనీసం 40 గంటలు పనిచేయాల్సిందేనని ఆదేశించారు. దీంతో అప్పట్లో కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌లో నిద్రపోయి పనిచేసిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని