Elon Musk: ట్విటర్‌ సీఈవోగా వైదొలగండి.. ఎలాన్‌ మస్క్‌ ‘పోల్‌’ ఫలితమిదే..!

ట్విటర్‌ అధిపతిగా కొనసాగాలా..? లేక వైదొలగాలా..? అంటూ ఎలాన్‌ మస్క్ చేపట్టిన పోల్‌లో ఆయనకు చుక్కెదురయ్యింది. ఈ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ 57.5శాతం మంది యూజర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.  

Published : 19 Dec 2022 18:08 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు ఊహించని పరిణామం ఎదురయ్యింది. తాను ట్విటర్‌ (Twitter) అధిపతిగా కొనసాగాలా? లేక వైదొలగాలా? అని ప్రశ్నిస్తూ ట్విటర్‌లో చేసిన పోల్‌లో ప్రపంచ కుబేరుడికి చుక్కెదురయ్యింది. మొత్తం 1.75కోట్లకు పైగా ఓట్లు పోలవ్వగా.. అందులో 57.5శాతం యూజర్లు ఎలాన్‌ మస్క్‌ వైదొలగాలంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 42.5శాతం యూజర్లు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో యూజర్ల నిర్ణయానికి కచ్చితంగా కట్టుబడి ఉంటానంటూ చేసిన వాగ్దానంపై ఎలాన్‌ మస్క్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) దాంట్లో అనేక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ఆందోళన చెందుతున్న ప్రకటనదారులు ట్విటర్‌ (Twitter)తో సంబంధాలను తెంచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన దానికి క్షమాపణలు కోరిన ఆయన.. ఇకపై అలా జరగదని హామీ ఇచ్చారు. ఇకపై ట్విటర్‌లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా పోల్‌ నిర్వహిస్తానని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ట్విటర్‌ ఖాతాలో నిర్వహించిన పోల్‌లో ప్రతికూల ఫలితం వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని