Elon Musk: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’పై ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Elon Musk Criticizes Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోంపై ఎలాన్‌ మస్క్‌ తొలి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓ అడుగు ముందుకేసి ఈ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 17 May 2023 11:01 IST

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని (Work From Home)’ చేసే వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో దశలవారీగా తిరిగి ఆఫీసులకు రావాలని తమ ఉద్యోగులను ఆదేశిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసుల నుంచి పనిచేసే కొత్త హైబ్రిడ్‌ విధానం పుట్టుకొచ్చింది. అయితే, కొంత మంది ఇప్పటికీ ఇంటి నుంచే పనిచేయడానికి (Work From Home) మొగ్గు చూపుతున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వర్క్‌ ఫ్రమ్‌ హోంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎలాన్‌ మస్క్‌ తొలి నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోం (Work From Home)పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టెస్లా ఉద్యోగులంతా వారానికి కనీసం 40 గంటలు ఆఫీసు నుంచి పనిచేయాలని ఆదేశించారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల నుంచి ఆశించినంత ఉత్పాదకతను రాబట్టలేమని ఆయన గతంలో ఓ సందర్భంలో అభిప్రాయపడ్డారు. తాజాగా సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఓ అడుగు ముందుకేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం (Work From Home) నైతికతకు సంబంధించిన విషయమన్నారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) వల్ల.. కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిన సర్వీస్‌ వర్కర్లకు తప్పుడు సందేశం వెళ్తుందని మస్క్‌ అభిప్రాయపడ్డారు. కార్ల తయారీ, వాహన సర్వీసింగ్‌, భవన నిర్మాణ కార్మికులు, వంట మనుషులు.. ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారు, ఇంట్లో ఉండి ల్యాప్‌టాప్‌పై పనిచేసేవారిని చూసి మరో రకంగా అనుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం కేవలం ఉత్పాదకతకు సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు. ఇది నైతికపరమైన విషయంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు