Elon Musk: చాట్‌జీపీటీకి పోటీగా మస్క్‌ కొత్త ఏఐ చాట్‌బాట్‌!

ఐదేళ్ల క్రితం చాట్‌జీపీటీ (ChatGPT)కి వ్యతిరేకంగా ఉన్న ఎలాన్‌ మస్క్‌(Elon Musk), ఇప్పుడు కొత్తగా ఏఐ చాట్‌బాట్‌ (AI ChatGPT)ను అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 03 Mar 2023 18:22 IST

కాలిఫోర్నియా: సాంకేతికరంగంలో ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ (ChatGPT) ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది. దాదాపు అన్ని టెక్‌ దిగ్గజ సంస్థలు దీనిపై దృష్టి సారించాయి. చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐ (Open AI)లో మైక్రోసాఫ్ట్ (Microsoft) పెట్టుబడులు పెడితే.. గూగుల్‌ (Google) చాట్‌జీపీటీ తరహాలో కొత్తగా బార్డ్‌ (Bard) అనే ఏఐ టూల్‌ (AI Tool)ను అభివృద్ధి చేస్తోంది. మెటా (Meta), స్నాప్‌చాట్ (SnapChat)వంటి సామాజిక మాధ్యమ (Social Media) సంస్థలు సైతం ఏఐ చాట్‌బాట్‌ తరహా సేవలను అందించేందుకు ప్రయత్నాలు  మొదలుపెట్టాయి.

తాజాగా ఈ రేసులోకి ట్విటర్‌ (Twitter) సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేరిపోయారు. ఈయన కూడా చాట్‌జీపీటీ తరహాలో ఏఐ ఆధారిత కొత్త టూల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఏఐ నిపుణులతో చర్చలు జరుపుతున్నారట. మస్క్‌ ఏఐ ప్రాజెక్ట్‌ కోసం ఇగోర్‌ బాబుష్కిన్‌ (Igor Babuschkin) అనే గూగుల్ మాజీ ఉద్యోగిని నియమించుకున్నట్లు సమాచారం. గతంలో ఈయన గూగుల్ డీప్‌మైండ్‌ ఏఐ (DeepMind AI) యూనిట్‌లో పనిచేశారు. 

ఐదేళ్ల క్రితం అలా.. ఇప్పుడిలా

2015లో ఓపెన్‌ఏఐను శామ్‌ ఆల్టమన్‌ (Sam Altman) బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టాడు. ఆ తర్వాత 2018లో ఓపెన్‌ఏఐ నుంచి పెట్టుబడులను మస్క్‌ ఉపసంహరించుకున్నాడు. ఆ సమయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అణుబాంబు కంటే ప్రమాదమని మస్క్ వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు గతేడాది డిసెంబరులో కూడా ఏఐ ఓ భయానక అనుభవం అని మస్క్‌ ట్వీట్ చేశాడు. దీంతో ఐదేళ్ల క్రితం ఏఐ వ్యతిరేకంగా ఉన్న మస్క్‌.. తాజాగా ఏఐ తరహా టూల్‌ను అభివృద్ధి చేసేందుకు సిద్ధమవడంపై సాంకేతికత రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల టెస్లా పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో సైతం మస్క్‌ ఏఐ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కార్లను ఏఐ నిర్మిస్తుందని తాను అనుకోవడం లేదని, ఒకవేళ అదే జరిగితే మనమంతా పనిచేయడం వృథానే అని వ్యాఖ్యానించారట. మస్క్‌ తీసుకురాబోయే ఏఐ చాట్‌బాట్‌కు బేస్డ్‌ ఏఐ (Bsed AI), వోక్‌ ఏఐ (Woke AI) లేదా క్లోజ్డ్‌ ఏఐ (Closed AI) అనే పేర్లను పరిశీలిస్తున్నారట. ఇటీవల టెస్లా కంపెనీ సదస్సులో మాట్లాడుతూ ఏఐ కార్ల నిర్మాణంలో సహాయం చేస్తుందని గతేడాది నవంబరులో విడుదలైన చాట్‌జీపీటీ తక్కువ సమయంలోనే కోట్లాది యూజర్లకు చేరువైంది. యూజర్ల సందేహాలకు క్లుప్తంగా, కచ్చితమైన సమాధానాలను అందిస్తుండటంతో ఎంతో పాపులర్‌ అయింది.  వ్యాసాలు, కంప్యూటర్ కోడింగ్, సాహిత్యం, మ్యాథమ్యాటిక్స్ ఇలా ఏ విషయానికి సంబంధించిన సందేహాలను క్షణాల్లో సమాధానం ఇస్తోంది. ప్రశ్న-సమాధానం తరహాలో ఇది పనిచేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని