Elon Musk: ట్విటర్‌లో ‘వాక్‌ స్వాతంత్ర్యం’.. అర్థం చెప్పిన ఎలాన్‌ మస్క్‌

‘వాక్‌ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’.. ట్విటర్‌ను కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి ఎలాన్‌ మస్క్‌ చెబుతున్న మాటలివి. అత్యంత ప్రభావవంతమైన

Published : 27 Apr 2022 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘వాక్‌ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’.. ట్విటర్‌ను కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి ఎలాన్‌ మస్క్‌ చెబుతున్న మాటలివి. అత్యంత ప్రభావవంతమైన సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విటర్‌లో దీనిపై నియంత్రణ ఉండటం సరికాదన్నది ఆయన అభిప్రాయం. అందుకే ట్విటర్‌ కొనుగోలుకు ఒప్పందం పూర్తయిన తర్వాత చేసిన తొలి సందేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విమర్శలూ రాకపోలేదు. మస్క్‌ నేతృత్వంలో ట్విటర్‌లో విద్వేష ప్రసంగాలు పెరిగే అవకాశముందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై తాజాగా స్పందించిన మస్క్‌.. ట్విటర్‌లో ‘వాక్‌ స్వాతంత్ర్యం’పై స్పష్టతనిచ్చారు.

‘‘వాక్‌ స్వాతంత్ర్యం గురించి భయపడుతున్న వారికి నేను చెప్పేది ఒక్కటే. ‘ఫ్రీ స్పీచ్‌’ అనేది చట్టానికి లోబడి ఉండాలనేదే నా అభిప్రాయం. చట్టానికి మించిన సెన్సార్‌షిప్‌కు నేను వ్యతిరేకం. వాక్‌ స్వాతంత్ర్యం తక్కువగా ఉండాలని ప్రజలు కోరుకుంటే.. ఆ విధంగా చట్టాలను తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరతారు. చట్టానికి అతీతంగా వెళ్లడమంటే.. ప్రజల అభీష్టానికి విరుద్ధంగా నడుచుకోవడమే’’ అని మస్క్‌ తన ట్విటర్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మానవ హక్కుల బృందాల నుంచి విమర్శలు వచ్చాయి. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ట్విటర్‌లో వాక్‌ స్వాతంత్ర్యాన్ని అనుమతించడం.. విద్వేష ప్రసంగాలకు దారితీస్తుందని వారి వాదన. ఇక దీనివల్ల నకిలీ వార్తల ప్రచారం కూడా జోరుగా ఉంటుందని మానవ హక్కుల బృందాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మస్క్‌ స్పందిస్తూ.. వాక్‌ స్వాతంత్ర్యం చట్టానికి సరిపోయేలానే ఉంటుందని వివరణ ఇచ్చారు.

ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు మస్క్‌ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనే, మూడో అతిపెద్ద కొనుగోలు లావాదేవీగా ఇది నిలిచింది. అయితే తన చేతిలోకి వచ్చిన తర్వాత ట్విటర్‌లో మస్క్‌ పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్విటర్‌ అల్గారిథమ్‌ ‘ఓపెన్‌సోర్స్‌’గా మారబోయే అవకాశం ఉండటంతో పాటు నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడం కోసం ఒక రేటింగ్‌ వ్యవస్థను మస్క్‌ తీసుకొస్తారన్న అంచనాలున్నాయి. దీంతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను తిరిగి ట్విటర్‌లోకి తీసుకొస్తారన్న వార్తలూ వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని