Twitter: మస్క్‌పై విమర్శలు.. గంటల్లోనే ఊడిన ఉద్యోగం!

వాక్‌ స్వేచ్ఛను పరిరక్షించడం చాలా ముఖ్యమని అందులో భాగంగానే ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నానని ఎలాన్‌ మస్క్‌ పలుసార్లు తెలిపారు. అయితే, ఇటీవల ఆయన్ని విమర్శించిన ఇద్దరు ఉద్యోగుల్ని తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Updated : 15 Nov 2022 14:13 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌లో ఇద్దరు ఉద్యోగుల్ని సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్ బహిరంగంగా తొలగించేశారు. వారివురు మస్క్‌ని ట్విటర్‌ వేదికగా విమర్శించిన కొన్ని గంటల్లోనే ఆయన వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు తాను వాక్‌ స్వేచ్ఛకు పరిరక్షకుడిగా అభివర్ణించుకుంటున్న ఎలాన్‌ మస్క్‌.. ఈ తరహాలో వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉద్వాసనకు గురైన వారిలో ఇంజినీర్‌ ఎరిక్‌ ఫ్రోన్‌హోఫర్‌ ఒకరు. ఆయన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ట్విటర్‌ యాప్‌పై పనిచేశారు. మస్క్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ను ఎరిక్‌ ఆదివారం రీట్వీట్‌ చేశారు. దానికి ‘ట్విటర్‌ యాప్‌ సాంకేతికపరమైన అంశాన్ని మస్క్‌ అర్థం చేసుకుంటున్న తీరు తప్పు’ అన్న వ్యాఖ్యను జత చేశారు. దీనికి మస్క్‌ స్పందిస్తూ.. ఎలాగో వివరించాలని కోరారు. అలాగే ‘‘దానికంటే ముందు ఆండ్రాయిడ్‌లో ట్విటర్‌ చాలా నెమ్మదిగా పనిచేస్తోంది. దాన్ని పరిష్కరించడానికి ఏం చేశారు’’ అని ఎరిక్‌ను మస్క్‌ ట్విటర్‌ వేదికగానే ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ ఎరిక్‌ కొన్ని ట్వీట్లు చేశారు. మధ్యలో ఓ యూజర్‌ కలగజేసుకుంటూ.. ‘‘మీ అభిప్రాయాన్ని మస్క్‌తో వ్యక్తిగతంగా ఎందుకు పంచుకోలేదు’’ అని ప్రశించారు. దానికి బదులిస్తూ.. మస్క్‌ కూడా మెయిల్‌ లేదా స్లాక్‌ ద్వారా వ్యక్తిగతంగా ప్రశ్నలు అడిగి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. కట్‌ చేస్తే.. ఎరిక్‌ను కంపెనీ నుంచి తొలగించినట్లు మస్క్ సోమవారం ట్వీట్‌ చేశారు. దీనికి ఎరిక్‌ స్పందిస్తూ ‘సెల్యూట్‌ ఎమోజీ’ని జతచేశారు.

ఉద్వాసనకు గురైన మరో ఇంజినీర్‌ బెన్‌ లీబ్‌. ఆయన కూడా మస్క్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ... ‘‘ఆయన (ఎలాన్‌ మస్క్‌).. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు అని బలంగా చెప్పగలను’’ అని కామెంట్‌ చేశారు. 10 ఏళ్లుగా పనిచేస్తున్న తనను మస్క్‌ కంపెనీ నుంచి తొలగించారని లీబ్‌ ఆదివారం మీడియాకు తెలిపారు.

ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ బాధ్యతల్ని చేపట్టినప్పటి నుంచి సంస్థలో చాలా మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉద్యోగులు, యాజమాన్యం మధ్య జరిగే కమ్యూనికేషన్లలో కూడా మార్పు వచ్చినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంతమంది తెలిపారు. అంతకుముందు ఏమైనా అభ్యంతరాలుంటే ఇ-మెయిల్‌ లేదా స్లాక్ ద్వారా ఉద్యోగులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేవారని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని.. అసలు ఎవరికి తెలియజేయాలో కూడా ఓ స్పష్టత లేదని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్విటర్‌ పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని.. సాంకేతిక సమస్యలు రావొచ్చని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌లో మరో కోడింగ్‌ ఫ్రీజ్‌కు సోమవారం  యాజమాన్యం ఆదేశించింది. దీంతో యాప్‌లో కొన్ని ప్రోడక్ట్ అప్‌డేట్స్ ఆగిపోనున్నాయి. ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటనేది యాజమాన్యం ఉద్యోగులకు కూడా తెలియజేయలేదు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts