Elon Musk: మస్క్‌ కొత్త కంపెనీ ‘ఎక్స్‌ హోల్డింగ్స్‌’

ట్విటర్‌ కొనుగోలుకు ప్రయత్నిస్తున్న బిలియనీర్ ఎలాన్‌ మస్క్‌ మరో మూడు కొత్త హోల్డింగ్‌ కంపెనీలను నమోదు చేశారు....

Published : 24 Apr 2022 14:45 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ కొనుగోలుకు ప్రయత్నిస్తున్న బిలియనీర్ ఎలాన్‌ మస్క్‌ మరో మూడు కొత్త హోల్డింగ్‌ కంపెనీలను నమోదు చేయించారు. బహుశా ఆయన తన వ్యాపారాలన్నింటినీ ఓ ‘సూపర్‌ కంపెనీ’ కిందకు తెచ్చే యోచనలో ఉండొచ్చని బ్లూమ్‌బెర్గ్‌ ఓ కథనంలో పేర్కొంది. పన్ను ప్రయోజనాలు ఎక్కువగా ఉండే డెలావెర్‌ రాష్ట్రంలో మంగళవారం ఆయన వీటిని రిజిస్టర్ చేయించారు. ‘ఎక్స్‌ హోల్డింగ్స్‌’ పేరుకు వెనక I, II, III అని తగిలించి మూడు విడివిడి కంపెనీలుగా పేర్కొన్నారు.

అమెరికా సెక్యూరిటీ ఎక్స్ఛేంజీలకు మస్క్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎక్స్‌ హోల్డింగ్స్‌-Iలో డబ్బులు ఉంచి ట్విటర్‌ కొనుగోలుకు యత్నిస్తారు. ఒకవేళ ఈ బిడ్‌ విజయవంతమైతే ఇది ట్విటర్‌కు మాతృసంస్థగా పనిచేయనుంది. కొనుగోలు ఒప్పందంలో భాగంగా ‘ఎక్స్‌ హోల్డింగ్స్‌-II’ను.. ‘ఎక్స్‌ హోల్డింగ్స్‌-I’లో విలీనం చేస్తారు. ‘ఎక్స్‌ హోల్డింగ్స్‌-III’ను ఈ మొత్తం లావాదేవీకి నిధులు సమీకరించేందుకు వినియోగించనున్నారు.

ఇప్పటికే మస్క్‌కు ఉన్న టెస్లా, స్పేస్‌-ఎక్స్‌ వ్యాపారాలకు.. తాజా హోల్డింగ్‌ కంపెనీలకు ఏమైనా అనుబంధం ఉంటుందా.. లేదా.. అనే విషయంపై ఇప్పటికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే, తన వ్యాపారాలన్నింటికీ ఓ మాతృసంస్థను ఏర్పాటు చేసే ఆలోచనను మాత్రం గతంలో ఓసారి మస్క్‌ ప్రస్తావించారు. అలాగే ‘ఎక్స్‌’ పేరిట ఓ హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేసి అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న ఓ ట్విటర్‌ యూజర్‌ ఇచ్చిన సలహాను ‘గుడ్‌ ఐడియా’ అంటూ మస్క్‌ ప్రశంసించారు.

ఇటీవల జరిగిన టెడ్‌ సమావేశంలోనూ మాతృసంస్థ ఏర్పాటును మస్క్‌ కొట్టిపారేయలేదు. అయితే, అలాంటి హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేయడం కొంత క్లిష్టమైన పని అని పేర్కొన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌, బోరింగ్‌, న్యూరాలింక్‌.. ఇలా తన కంపెనీలకు ఉన్న పెట్టుబడిదారులు భిన్న రంగాలకు చెందినవారని తెలిపారు.

మస్క్‌ తన కంపెనీలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి గూగుల్‌ తరహా వ్యూహం అనుసరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 2015లో అల్ఫాబెట్‌ అనే హోల్డింగ్‌ కంపెనీని స్థాపించి గూగుల్‌ను పునర్‌వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేటు సంస్థలుగా ఉన్న స్పేస్‌ఎక్స్‌, న్యూరాలింక్‌, బోరింగ్‌ను వేర్వేరుగా మస్క్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు