Elon Musk: మస్క్‌పై వేలాడుతున్న ఫైన్‌ కత్తి!

ట్విటర్‌లో వాటాలను కొనుగోలు చేసిన మస్క్‌ ఈ విషయాన్ని ఎస్‌ఈసీకి సకాలంలో తెలియజేయని కారణంగా భారీ ఎత్తున జరిమానా చెల్లించాల్సిన అసవరం ఉందని సమాచారం...

Published : 26 Apr 2022 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజాగా ట్విటర్‌ (Twitter)ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ (Elon Musk)‌.. 2022 ఆరంభం నుంచే కంపెనీలో వాటాలను కొనడం ప్రారంభించారు. జనవరి-ఏప్రిల్‌ మధ్య దాదాపు 10 శాతం షేర్లు కొనుగోలు చేశారు. దీనికోసం ఆయన 2.64 బిలియన్‌ డాలర్లు వెచ్చించారు. ఈ విషయాన్ని ఆయన ఏప్రిల్‌ 4 వరకు అమెరికా సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ కమిషన్‌ (SEC)కు తెలియజేయలేదు. దాదాపు 11 రోజులు ఆలస్యం చేశారు. ఫలితంగా 156 మిలియన్‌ డాలర్ల లబ్ధి పొందినట్లు నిపుణులు అంచనా వేశారు.

నిబంధనల ప్రకారం.. మదుపర్ల వాటా ఐదు శాతం మించితే ఆ విషయాన్ని 10 రోజుల్లోగా ఎస్‌ఈసీకి తెలియజేయాలి. మార్చి 14 నాటికే ట్విటర్‌లో తన వాటా 5% దాటినట్లు ఎక్స్ఛేంజీలకించ్చిన సమాచారంలో మస్క్‌ వెల్లడించారు. కానీ, ఆ విషయాన్ని ఆయన ఏప్రిల్‌ 4 వరకు దాచి ఉంచారు. ఈ మధ్య కాలంలో ఆయన ఒక్కో షేరుకు 39 డాలర్లు చెల్లించి మరిన్ని వాటాలు కొన్నారు. ఫలితంగా ఆయన మొత్తం వాటా 9.2 శాతానికి పెరిగింది. మస్క్‌ తన వాటాల సంగతి బయటకు వెల్లడించిన వెంటనే ట్విటర్‌ ఒక్కో షేరు ధర దాదాపు 30 శాతం పెరిగి 50 డాలర్లు దాటింది. ఒకవేళ 5శాతం వాటా పరిమితికి చేరుకోగానే వెల్లడించి ఉంటే మిగిలిన 4.1 శాతం షేర్ల కోసం ఆయన అదనంగా 156 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉండేది.

ఈ నిబంధనను ఉల్లంఘించినందుకుగానూ మస్క్‌ ఎస్‌ఈసీకి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, లబ్ధి పొందిన 156 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే మాత్రం ఫైన్‌ చాలా తక్కువే ఉండే అవకాశం ఉందని సమాచారం. గరిష్ఠంగా రెండు లక్షల డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని జార్జిటౌన్‌ లా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఉర్క్సా వెలికోంజా వెల్లడించారు. 

ఎస్‌ఈసీతో పేచీ కొత్తేం కాదు..

సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ కమిషన్‌  నిబంధనల్ని ఉల్లఘించి జరిమానాకు చెల్లించడం మస్క్‌కు ఇది కొత్తేమీ కాదు. 2018లో తన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లాను పూర్తిగా ప్రైవేట్‌ కంపెనీగా మార్చనున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. అందుకోసం ఆయనకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిపారు. ఎస్‌ఈసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో 20 మిలియన్‌ డాలర్లు జరిమానా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పైగా న్యాయవాదుల నుంచి ముందస్తు అనుమతి తీసుకొనే ట్వీట్లు చేస్తానని అంగీకరించారు.

ఆ తర్వాత కూడా ఆయన అనేకసార్లు నిబంధనల్ని ఉల్లంఘించిన దాఖలాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గత నవంబరులో తన టెస్లా వాటాల్లో 10 శాతం విక్రయించాలా? అని పోల్‌ నిర్వహించారు. అంతకు ముందు రోజే ఆయన సోదరుడు భారీ ఎత్తున టెస్లా వాటాలను విక్రయించినట్లు సమాచారం. అలాగే ట్విటర్‌లో ఎడిట్‌ బటన్‌ సహా పలు మార్పులను సూచిస్తూ ఈ మార్చి-ఏప్రిల్‌ మధ్య అనేక ట్వీట్లు చేశారు. ట్విటర్‌ పనితీరుపై విమర్శలు కూడా గుప్పించారు. ఆ సమయంలోనే ఆయన వాటాలను కొనుగోలు చేయడం గమనార్హం. ఇది కూడా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని