Twitter: ట్విటర్‌లో పోస్టింగులకు ఇక డబ్బులు: ఎలాన్‌ మస్క్‌

Twitter: ట్విటర్‌లో చేసే పోస్ట్‌ల నుంచి యూజర్లు డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని మస్క్‌ కల్పిస్తున్నారు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుందని తెలిపారు.

Updated : 14 Apr 2023 14:21 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అధీనంలోకి వెళ్లిన తర్వాత సామాజిక మాధ్యమం ట్విటర్‌ (Twitter)లో అనేక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా యూజర్లు తమ కంటెంట్‌ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు మస్క్‌ వెల్లడించారు. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను పెట్టుకొని డబ్బులు ఆర్జించుకోవచ్చని తెలిపారు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుందని వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ అమెరికాలోనే ఉందని తెలిపారు. త్వరలో ఇతర దేశాలకూ విస్తరిస్తామని తెలిపారు.

ఇలా తమ కంటెంట్‌ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి వచ్చే 12 నెలల పాటు ట్విటర్‌ (Twitter) ఎలాంటి రుసుములూ తీసుకోబోమని మస్క్‌ (Elon Musk) వెల్లడించారు. అంటే సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో గరిష్ఠంగా 70 శాతం వరకు యూజర్లకే వచ్చేస్తుందని తెలిపారు. ట్విటర్‌ (Twitter) ద్వారా ఆర్జిస్తున్న మొత్తంలో నుంచి ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ 30 శాతం యాప్‌స్టోర్‌ ఫీజు కింద వసూలు చేస్తోంది. వెబ్‌లో అయితే 92 శాతం వరకు ఆదాయం యూజర్లకే చెందుతుందని మస్క్ (Elon Musk) స్పష్టం చేశారు. అలాగే కంటెంట్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకూ ట్విటర్‌ సహకరిస్తుందని తెలిపారు. కావాలంటే ఎప్పుడైనా తమ కంటెంట్‌తో సహా ట్విటర్‌ నుంచి బయటకు వెళ్లొచ్చని పేర్కొన్నారు.

తాజా మార్పుల ద్వారా మరింత ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్లను ట్విటర్‌ (Twitter) వేదిక మీదకు తీసుకొచ్చేందుకు మస్క్‌ (Elon Musk) యత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. లేదా వారు ట్విటర్‌ను వీడి వెళ్లకుండా అట్టేపెట్టుకోవడం కోసం ఇదొక వ్యూహమైనా అయి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. తొలి 12 నెలల పాటు ఎలాంటి రుసుము తీసుకోకపోయినప్పటికీ.. భవిష్యత్‌తో ఇది మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కంటెంట్‌ నుంచి డబ్బు ఆర్జించుకునే ఆప్షన్‌ యూజర్లకు ఇవ్వడం ద్వారా ప్రముఖ న్యూస్‌లెటర్‌ కంపెనీ సబ్‌స్టాక్‌కు పోటీ ఇవ్వడం కూడా మస్క్‌ (Elon Musk) వ్యూహంలో ఒక భాగమై ఉండొచ్చన్నది టెక్‌ నిపుణుల అంచనా. సబ్‌స్టాక్‌ సైతం తమ వేదికపై యూజర్లు ఎలాంటి కంటెంట్‌నైనా సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా అందించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, ఇటీవల ఈ సంస్థ నోట్స్‌ పేరిట ట్విటర్‌ (Twitter) తరహాలో పబ్లిక్‌ ఫీడ్‌ను పోస్ట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో సబ్‌స్టాక్‌ సైతం ట్విటర్‌లా మారిపోయింది. ఈ నేపథ్యంలో సబ్‌స్టాక్‌ లింక్స్‌ ఉన్న ట్వీట్లను లైక్‌ చేయడం, రిప్లై ఇవ్వడం, రీట్వీట్‌ చేయడం వంటి వాటిని ట్విటర్‌ తాత్కాలికంగా నిలిపివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని