Twitter: ట్విటర్‌లో సగం మంది ఉద్యోగుల తొలగింపు?

Twitter: ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపుపై గతకొంత కాలంగా వస్తున్న ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు సగం మందిని మస్క్‌ ఇంటికి పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 03 Nov 2022 11:20 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌ (Twitter) కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కంపెనీ నుంచి సగం మంది ఉద్యోగుల్ని తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు 3,700 మంది సిబ్బందిని కంపెనీ నుంచి పంపించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. శుక్రవారం ఈ జాబితాను వెలువరించొచ్చని సమాచారం.

ఆఫీసుకు రావాల్సిందే.. 

మరోవైపు ప్రస్తుతం ట్విటర్‌ (Twitter) అమలు చేస్తున్న ‘ఎక్కడి నుంచైనా పనిచేసుకునే విధానా’న్ని సైతం మస్క్‌ (Elon Musk) ఉసహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని మినహాయింపులను పక్కన పెట్టి మిగిలినవారంతా కంపెనీకి వచ్చి పనిచేయాలని త్వరలోనే ఆదేశాలు జారీ చేయవచ్చని సమాచారం. ఉద్యోగుల సంఖ్యలో కోత సహా ఇతర మార్పులపై మస్క్‌ తన సలహాదారులతో విస్తృతంగా చర్చిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ఉద్వాసనకు గురయ్యే వారికి అందించాల్సిన పరిహారంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 60 రోజుల వేతనం ఇచ్చి వారిని పంపించాలనుకుంటున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

8 డాలర్లు వచ్చేవారమే..

మరోవైపు ట్విటర్‌లో బ్లూ టిక్ సహా ఇతర ప్రయోజనాలకు 8 డాలర్లు చెల్లించాలన్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మస్క్‌ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని ట్విటర్‌ వేదికగా పలువురికి గట్టిగా బదులిచ్చారు. చెల్లించిన మొత్తానికి కచ్చితంగా ప్రతిఫలం దక్కుతుందని తెలిపారు. మరోవైపు వచ్చే వారం నుంచే ఈ కొత్త ఛార్జీని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కంపెనీలోని ఉన్నత వర్గాలు చెప్పాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని