Elon Musk: ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలాన్‌ మస్క్‌

Elon Musk: ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు కుంగడంతో ఆ సంస్థ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సంపద తరిగిపోతోంది. దీంతో ఇప్పటి వరకు ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఆయన స్థానాన్ని ఎలాన్‌ మస్క్‌ భర్తీ చేశారు.

Updated : 01 Jun 2023 15:20 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ ధనవంతుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (Bernard Arnault) సంపద బుధవారం 2.6 శాతం కుగింది. దీంతో ‘బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ’ (Bloomberg Billionaires Index)లో మస్క్‌ పైకి ఎగబాకారు.

ఆర్నాల్ట్‌ (Bernard Arnault) తొలిసారి గత డిసెంబరులో మస్క్‌ను దాటేసి మొదటిస్థానానికి చేరారు. టెక్‌ ఇండస్ట్రీ భారీ ఒడుదొడుకులు ఎదుర్కోవడం, ట్విటర్‌ కొనుగోలు తర్వాత పరిణామాల నేపథ్యంలో టెస్లా (Tesla) షేరు విలువ అప్పట్లో భారీగా పతనమైంది. దీంతో మస్క్‌ వ్యక్తిగత సంపద తరిగిపోయింది. మరోవైపు అదే సమయంలో కరోనా పరిస్థితులు చక్కబడడంతో విలాసవంత వస్తువుల కొనుగోళ్లు పుంజుకొన్నాయి. ఫలితంగా ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) షేర్లు రాణించాయి. తిరిగి ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు బలపడడంతో మళ్లీ లగ్జరీ వస్తువుల తయారీ సంస్థల షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి.

విలాసవంత వస్తువులకు పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్‌ (LVMH) షేర్లు ఏప్రిల్‌ నుంచి 10 శాతానికి పైగా కుంగాయి. ఓ దశలో ఒక్కరోజులోనే ఆర్నాల్ట్‌ (Bernard Arnault) సంపదలో 11 బిలియన్‌ డాలర్లు ఆవిరయ్యాయి. మస్క్‌ (Elon Musk) సంపద మాత్రం ఈ ఏటా పెరుగుతూ పోతోంది. ట్విటర్‌ కొనుగోలు పరిణామాల నేపథ్యంలో కుంగిన టెస్లా (Tesla) షేర్లు కనిష్ఠాల నుంచి పుంజుకోవడమే ఇందుకు కారణం. మస్క్‌ వ్యక్తిగత సంపదలో 71 శాతం వాటా టెస్లా షేర్లదే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు టెస్లా షేర్లు 66 శాతం పుంజుకున్నాయి. దీంతో మస్క్‌ సంపద 55.3 బిలియన్‌ డాలర్లు పెరిగి ప్రస్తుతం 192.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో ఆర్నాల్ట్‌ (Bernard Arnault) సంపద రూ.186.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని