Elon Musk: మస్క్‌ సంపాదన.. గంటలో రూ.11 వేల కోట్లు!

ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన పారిశ్రామికవేత్త, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌.. తాను స్థాపించిన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీలతో ఆయా రంగాల్లో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు

Published : 26 Oct 2021 17:51 IST

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన పారిశ్రామికవేత్త, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌.. తాను స్థాపించిన టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీలతో ఆయా రంగాల్లో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సంపద సైతం అదే స్థాయిలో పెరుగుతూ పోతోంది. సోమవారం ఒక్కరోజే ఆయన సంపద ఏకంగా 36.2 బిలియన్‌ డాలర్లు ఎగబాకింది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.2.71 లక్షల కోట్లు. అంటే గంటకు సుమారు రూ.11.31 వేల కోట్లన్నమాట! నిన్న హెర్ట్జ్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థ లక్ష టెస్లా కార్లకు ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో సంస్థ షేరు విలువ అమాంతం పెరిగింది. సోమవారం ఒక్కరోజే టెస్లా షేరు విలువ 14.9 శాతం పెరిగి 1,045.02 డాలర్లకు చేరింది.

ఈ నేపథ్యంలో మస్క్‌ సంపద సైతం 36.2 బిలియన్‌ డాలర్లు పెరిగి 288.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2021లో ఇప్పటి వరకు మస్క్‌ సంపద విలువ బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం 119 బిలియన్‌ డాలర్లు ఎగబాకింది. మరోవైపు టెస్లా కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 100 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో.. యాపిల్‌, అమెజాన్‌, సౌదీ ఆరామ్‌కో, మైక్రోసాఫ్ట్‌, అల్ఫాబెట్‌ సరసన చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని