Elon Musk: 13 కిలోలు తగ్గిన ఎలాన్‌ మస్క్‌.. సీక్రెట్‌ ఏంటో చెప్పిన కుబేరుడు!

మస్క్‌ ట్విటర్‌పైనే కాదు. ఆయన ఆరోగ్యంపై కూడా ఇటీవల దృష్టి సారించారు. బరువు తగ్గడానికి ప్రత్యేక పద్దతులు పాటిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఆయన 13 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు. దీని కోసం ఆయన ఏం చేస్తున్నారో వెల్లడించారు.

Updated : 17 Nov 2022 16:33 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) పేరు చెప్పగానే.. ట్విటర్‌, ఉద్యోగుల తొలగింపు, సామాజిక మాధ్యమంలో మార్పులు.. అందరికీ ఇవే గుర్తొస్తున్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన వేరే విషయంలో వార్తల్లోకి వస్తున్నారు. ఈ మధ్య ఆయన ట్విటర్‌ మీదే కాకుండా ఆరోగ్యంపై కూడా ధ్యాస పెట్టారట!  భారీగా బరువు కూడా తగ్గారట. ఈ విషయంపై ఓ యూజర్‌ ట్విటర్‌లో అడగ్గా.. బరువు తగ్గడం వెనకున్న రహస్యమేంటో కూడా మస్క్‌ (Elon Musk) చెప్పేశారు.

షికాగో గ్లెన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఎలాన్ మస్క్‌ (Elon Musk) కు చెందిన రెండు చిత్రాలను ఒక దగ్గర ఉంచి పోస్ట్‌ చేశారు. బరువు బాగా తగ్గారని ప్రశంసించారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్‌.. తాను దాదాపు 13 కిలోలు తగ్గినట్లు చెప్పారు. దీని వెనకున్న రహస్యమేంటని అడగ్గా.. మూడు కారణాలను వెల్లడించారు. ఉపవాసం, మధుమేహానికి సంబంధించిన రెండు ఔషధాలు, దగ్గర్లో రుచికరమైన భోజనం లేకుండా చూసుకోవడం.. ఈ మూడూ తనకు బరువు తగ్గడంలో ఉపకరించాయని తెలిపారు. ఓ స్నేహితుడి సలహా మేరకు తాను తరచూ ఉపవాసం ఉంటున్నట్లు వెల్లడించారు. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని తెలిపారు. అయితే, ఔషధాల వల్ల తేన్పుల వంటి దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఆగస్టులోనూ మస్క్‌ 9 కిలోలు తగ్గినట్లు తెలిపారు. దీనికి ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ (Intermittent fasting) ఉపకరిస్తున్నట్లు అప్పట్లో తెలిపారు.

అయితే, మస్క్‌ పాటిస్తున్న ఈ విధానం అందరికీ ఫలితాలిస్తుందన్న గ్యారెంటీ లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మస్క్‌ పేర్కొన్న ఔషధాలు కచ్చితంగా బరువు తగ్గిస్తాయని చెప్పలేమని తెలిపారు. పైగా శరీరతత్వాన్ని బట్టి బరువు తగ్గడానికి వివిధ పద్ధతులు అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనికి డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మేలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని