Twitter: మస్క్‌ బృందంలో భారతీయుడు.. ఎవరీ కృష్ణన్‌?

Twitter: ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్‌ ఇద్దరు భారత సంతతికి చెందిన కీలక వ్యక్తుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మరో భారతీయుడు శ్రీరామ్‌ కృష్ణన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.

Updated : 01 Nov 2022 19:48 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మార్పులకు శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ సహా లీగల్‌ హెడ్‌ విజయ గద్దె, మరికొందరు ప్రముఖుల తొలగింపుతో ఆయన తన కార్యాచరణను మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొంతమంది కీలక వ్యక్తులు ట్విటర్‌లో మార్పులపై మస్క్‌కు సాయంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలోనూ భారత సంతతికి చెందిన వ్యక్తి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ టెక్‌ నిపుణుడిగా పేరొందిన శ్రీరామ్‌ కృష్ణన్‌ మస్క్‌కు సలహాలిస్తున్న వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘మరికొంత మంది గొప్ప వ్యక్తులతో కలిసి ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌కు తాత్కాలికంగా సాయం చేస్తున్నాను. ఇది ఒక ముఖ్యమైన సంస్థగా నేను భావిస్తున్నాను. ప్రపంచంపై చాలా ప్రభావం చూపుతుందని విశ్వసిస్తున్నాను. ఎలాన్‌ మస్కే దీనికి సరైన వ్యక్తి’’ అని కృష్ణన్‌ అన్నారు. 

చెన్నై కుర్రాడే..

కృష్ణన్‌ ఆయన సతీమణి ఆర్తీ రామమూర్తి చెన్నైలోనే పుట్టి పెరిగారు. గత ఏడాది జులైలో న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకారం.. వీరిది ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం. వీరివురు 2003లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కాలేజీలో కలిశారు. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. 2010లో వీరు అమెరికాకు వెళ్లారు.

టెక్‌ దిగ్గజాలతో..

ప్రస్తుతం కృష్ణన్‌ సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ఆండ్రిసెన్ హోరోవిట్జ్‌ (a16z)లో భాగస్వామిగా ఉన్నారు. ప్రాథమిక దశలో ఉన్న అంకుర సంస్థల్లో ఈ కంపెనీ పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. అదే సమయంలో బిట్‌స్కీ, హోపిన్‌, పాలీవర్క్‌ కంపెనీ బోర్డుల్లో కృష్ణన్‌ సభ్యుడిగానూ ఉన్నారు. ఏ16జెడ్‌లో చేరడానికి ముందు ఆయన పలు టెక్ కంపెనీల్లో కీలక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఇటీవలి వరకు ట్విటర్‌లో హోం టైమ్‌లైన్‌, న్యూ యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌, సెర్చ్‌, డిస్కవరీ, ఆడియెన్స్‌ గ్రోత్‌ వంటి ప్రొడక్ట్‌లకు సంబంధించిన బృందాలకు నేతృత్వం వహించారు. అంతకుముందు స్నాప్‌, ఫేస్‌బుక్‌కు సంబంధించిన పలు మొబైల్‌ యాడ్‌ ప్రొడక్ట్స్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 

మైక్రోసాఫ్ట్‌తో కృష్ణన్‌ తన టెక్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. విండోస్‌ అజూర్‌కు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ‘ప్రోగ్రామింగ్‌ విండోస్‌ అజూర్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ప్రముఖ ఆడియో యాప్‌ క్లబ్‌హౌస్‌లో సతీమణి ఆర్తీ రామమూర్తితో కలిసి ‘ది గుడ్‌ టైమ్స్‌ షో’ అనే షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాన్‌ మస్క్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌, స్టీవ్‌ బామర్‌ వంటి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని