Twitter- Musk: ట్విటర్‌ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ!

Twitter- Musk: ట్విటర్‌ ఉద్యోగుల సంఖ్యను తొలగించాల్సిన అవసరం ఉందని తొలి నుంచీ వాదిస్తూ వస్తున్న ఎలాన్‌ మస్క్‌.. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు జాబితాను సిద్ధం చేయాలని మేనేజర్లను కోరినట్లు తెలుస్తోంది. 

Updated : 30 Oct 2022 10:17 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ (Twitter)ను ఇటీవలే సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇప్పటికే సీఈఓ, సీఎఫ్‌ఓ సహా ఇతర కీలక పదవుల్లో ఉన్న పలువురు ప్రముఖుల్ని తొలగించిన ఆయన ఇక ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది.

శనివారం నుంచే మస్క్‌ (Elon Musk) ఉద్యోగుల తొలగింపు ప్రణాళికల్ని అమలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మేనేజర్లకు ఆదేశాలు పంపినట్లు సమాచారం. తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను కోరినట్లు తెలుస్తోంది. విభాగాలను బట్టి ఉద్యోగుల తొలగింపు సంఖ్య ఉంటుందని ఓ కీలక ఉద్యోగి తెలిపారు. కొన్ని విభాగాల్లో ఎక్కువ.. మరికొన్నింటిలో తక్కువ మందికి ఉద్వాసన పలకనున్నారని చెప్పారు. నవంబరు 1వ తేదీన ఉద్యోగులు స్టాక్‌ గ్రాంట్స్‌ అందుకోనున్నారు. ఆలోపే  తొలగించేస్తే వారికి పరిహారం కింద వాటిని ఇవ్వాల్సిన అవసరం ఉండదని మస్క్‌ (Elon Musk) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంఖ్యను కుదించాల్సిన అవసరం ఉందని డీల్‌ కుదిరినప్పటి నుంచి మస్క్‌ చెబుతూ వస్తున్నారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తామని ఆయన బ్యాంకర్లకు చెప్పినట్లు కొనుగోలు ఒప్పందం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందులో వాస్తవం లేదని తర్వాత మస్క్‌ కొట్టిపారేశారు.

మరోవైపు ట్విటర్‌ (Twitter) కంటెంట్‌పరమైన విధానాలకు సంబంధించి ఓ మండలిని ఏర్పాటు చేస్తామని మస్క్‌ శుక్రవారం వెల్లడించారు. ‘కంటెంట్‌ మోడరేషన్‌ కౌన్సిల్‌’ ఏర్పాటు తర్వాతే విధానాల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కంటెంట్‌ మార్పులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అలాగే కొంతమంది ప్రముఖుల ఖాతాల్ని పునరుద్ధరించడంపైనా మండలి ఏర్పాటు తర్వాతే నిర్ణయం ఉంటుందని తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను ‘క్యాపిటల్‌ హిల్‌’పై దాడి సమయంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి ఖాతాలను తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉందని తొలి నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని