Elon Musk: టెస్లాపై నిర్లక్ష్యమా..?ప్రసక్తే లేదంటున్న మస్క్‌

ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఎలాన్ మస్క్‌ టెస్లాపై దృష్టిసారించడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే....

Updated : 20 May 2022 11:37 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను కొనుగోలు (Twitter Takeover) చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఎలాన్ మస్క్‌ (Elon Musk) టెస్లాపై దృష్టిసారించడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ కంపెనీలో మదుపు చేసిన వారు దీనిపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. తమ వద్ద టెస్లా షేర్ల (Tesla Shares)ను విక్రయించడం ద్వారా తమ అసహనాన్నీ వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌ (Twitter) మీద మాత్రమే దృష్టి సారించడం వల్ల టెస్లా ప్రణాళికలు, లక్ష్యాలు దెబ్బతింటాయన్నదే వారి ఆందోళన. ఈ పరిణామాల నేపథ్యంలో టెస్లా షేర్లు ఇటీవల భారీ కుంగుబాటును చవిచూశాయి. 

దీనిపై టెస్లాకు సీఈఓగా వ్యవహరిస్తున్న ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందించారు. టెస్లా 24/7 తన బుర్రలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ట్విటర్‌ కొనుగోలు (Twitter Takeover) వ్యవహారంపై తాను ఐదు శాతం కంటే తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేమీ రాకెట్‌ సైన్స్‌ కాదని వ్యాఖ్యానించారు. బుధవారం టెక్సాస్‌లోని టెస్లా గిగాఫ్యాక్టరీలో‌, గురువారం స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగ కేంద్రం స్టార్‌బేస్‌లో గడిపినట్లు తెలిపారు. చాలా మంది తనని ఎలా అపార్థం చేసుకుంటున్నారో చెప్పడానికి ఈ కింది సరదా చిత్రాన్ని మస్క్‌ తన ట్వీట్‌కు జత చేశారు...

ట్విటర్‌లో తను వాటాలు కొనుగోలు చేసినట్లు ఏప్రిల్‌లో మస్క్‌ ప్రకటించిన నాటి నుంచి టెస్లా షేర్ల (Tesla Shares) విలువ పతనమవుతూ వస్తోంది. తర్వాత డీల్‌కు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం కోసం 8.5 బిలియన్‌ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో టెస్లా షేర్ల విలువ ఇప్పటి వరకు మూడు శాతానికి పైగా కుంగింది. అయితే, చైనాలో విధించిన లాక్‌డౌన్‌ కూడా ఈ షేర్లపై ప్రభావం చూపాయి.


ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియ ముందుకే

ట్విటర్‌లో నకిలీ ఖాతాల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువే ఉన్నట్లు ఆధారాలు చూపించే వరకు కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ట్విటర్‌ మాత్రం తమ ఉద్యోగులకు ఇందుకు భిన్నమైన సమాచారాన్ని అందజేసింది. అనుకున్న ప్రకారమే డీల్‌ ముందుకు వెళుతోందని వెల్లడించింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్‌ పాలసీ హెడ్‌, ప్రముఖ న్యాయవాది విజయ గద్దె తెలిపారు. డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి విషయమేమీ లేదని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో గురువారం ట్విటర్‌ షేర్లు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని