Elon Musk: మీకో దండం.. విమర్శకులకు ‘నమస్తే’ చెప్పిన మస్క్‌!

Elon Musk: ట్విటర్‌లో చేస్తున్న మార్పులపై వస్తున్న విమర్శలతో ఎలాన్‌ మస్క్‌ విసుగెత్తిపోయారు. అదే పనిగా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఓ దండం పెట్టి వాటికి ముగింపు పలికారు.

Updated : 22 Nov 2022 11:49 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ట్విటర్‌లో చేస్తున్న మార్పులు, తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిలో కొన్నింటికి ఆయన ఓపికగా సమాధానం చెప్పారు. మరికొన్నింటిని తిప్పికొట్టారు. అయినా, విమర్శలు ఆగకపోవడంతో ఆయన విసుగెత్తిపోయారు. ‘మీరు ట్విటర్‌ (Twitter) నుంచి వైదొలిగినా సరే.. మీకో దండం’ అంటూ విమర్శకులకు ఓ ‘నమస్తే’ చెప్పి ముగించారు.

అదే పనిగా విమర్శలు వస్తుండడంతో మస్క్‌ (Elon Musk) విసుగెత్తారు. అలా చేసేవారంతా ఇతర సామాజిక మాధ్యమాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. చివరకు రెండు చేతులు జోడించి దండం పెడుతున్న ఓ ఎమోజీని జత చేస్తూ ‘నమస్తే’ అని ముగించారు. సాధారణంగా భారత్‌లో ఏదైనా విషయంలో చిర్రెత్తికొచ్చినప్పుడు ‘మీకో దండం’ అని రెండు చేతులు జోడించి ‘ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి’ అని అంటుంటారు! తాజాగా మస్క్‌ కూడా అదే పనిచేశారు. అయితే, ఇంగ్లిషులో కాకుండా భారతీయ భాషలో నమస్తే చెప్పడం విశేషం.

ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత మస్క్‌ ఈ సామాజిక మాధ్యమంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలుత ట్విటర్‌ బ్లూ సేవలకు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. అది కాస్తా బెడిసికొట్టడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు కంపెనీని లాభాల్లోకి తెచ్చేందుకు ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగించారు. మరోవైపు ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు ప్రతిపాదించారు. కష్టపడి పనిచేసే వాళ్లు మాత్రమే ఉండాలని అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇలా తనదైన శైలిలో తీసుకుంటున్న నిర్ణయాలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని