Elon Musk: మస్క్‌ రూటే సెపరేటు.. అమ్మనన్నారు.. కానీ, అమ్మేశారు!

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల దాదాపు ఏడు బిలియన్‌ డాలర్లు విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు...

Updated : 10 Aug 2022 15:30 IST

వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇటీవల దాదాపు ఏడు బిలియన్‌ డాలర్లు విలువ చేసే టెస్లా (Tesla) షేర్లను విక్రయించారు. ఈ విషయం రెగ్యులేటరీ ఫైలింగ్స్‌ ద్వారా వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ఆసక్తిగా మారింది.

టెస్లా సీఈఓగా ఉన్న మస్క్‌ (Elon Musk) కంపెనీలో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారు. గత శుక్రవారం నుంచి ఈ మంగళవారం మధ్య ఆయన దాదాపు 7.9 మిలియన్ల షేర్లను విక్రయించినట్లు రెగ్యులేటరీ వివరాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆయన వాటా 15 శాతంగా ఉంది. గత ఏడాది కాలంగా మస్క్‌ టెస్లా షేర్లను పలు దఫాల్లో విక్రయిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 32 బిలియన్‌ డాలర్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ట్విటర్‌ కొనుగోలు నిమిత్తం ఏప్రిల్‌లోనే ఏకంగా 8.5 బిలియన్‌ డాలర్ల విలువైన వాటాలను అమ్మారు. మరిన్ని షేర్లను విక్రయించబోనని ఆ సమయంలో మస్క్ చెప్పడం గమనార్హం.

ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి మస్క్‌ వెనక్కి మళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ట్విటర్‌ కోర్టును ఆశ్రయించింది. దీనిపై అక్టోబరులో విచారణ జరగనుంది. ఒకవేళ న్యాయస్థానం ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆదేశిస్తే.. మస్క్‌కు 33 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అవసరమవుతుంది. ఇప్పటికే మస్క్‌కు ట్విటర్‌లో తొమ్మిది శాతం వాటాలున్నాయి. కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్నట్లుగా ఒక్కో షేరు విలువను 54.20 డాలర్లుగా లెక్క కడితే.. మస్క్‌ వాటా విలువ నాలుగు బిలియన్‌ డాలర్లు.

‘‘షేర్లను విక్రయించడం ఇక ముగిసినట్లేనా?’’ అని ట్విటర్‌లో ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు మస్క్‌.. ‘‘అవును’’ అని సమాధానం ఇచ్చారు. ఏప్రిల్‌లోనూ ఇలాగే సమాధానం ఇవ్వడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ‘‘ఒకవేళ ట్విటర్‌ ఒప్పందం కచ్చితంగా పూర్తి చేయాల్సి వచ్చి.. ఈక్విటీ భాగస్వాములెవరైనా తనతో కలిసి రాకపోతే అత్యవసరంగా టెస్లా షేర్లను విక్రయించాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం’’ అని మస్క్‌ చెప్పారు. ఒకవేళ ట్విటర్‌ డీల్‌ విషయంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం రాకపోతే.. టెస్లా షేర్లను మళ్లీ కొనుగోలు చేస్తానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని