Elon Musk: నన్ను విమర్శించండి.. కానీ, ఫ్యామిలీ జోలికొస్తే..: ఎలాన్‌ మస్క్‌

Elon Musk: ట్విటన్‌ స్వేచ్ఛాయుత చర్చకు వేదికగా మారుస్తానని మస్క్‌ ఉద్ఘాటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనే జర్నలిస్టుల ఖాతాలను సస్పెండ్‌ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Published : 16 Dec 2022 13:30 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ (Twitter) గురువారం పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. అమెరికాలో ప్రధాన పత్రికలైన న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌కు చెందిన పాత్రికేయులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే, దీనికి కారణాన్ని మాత్రం ట్విటర్‌ (Twitter) ప్రత్యేకంగా వెల్లడించలేదు. ఇటీవలి కాలంలో ట్విటర్‌ (Twitter) అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)తో పాటు సామాజిక మాధ్యమంలో చేస్తున్న మార్పులపై వీరు కథనాలు రాశారు. ఈ పరిణామాలపై మరోవైపు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ట్విటర్‌లో స్పందించారు. ‘‘అందరికీ వర్తించే డాక్సింగ్‌ (doxxing) నిబంధనలే పాత్రికేయులకూ వర్తిస్తాయి’’ అని అన్నారు. యూజర్ల వ్యక్తిగత వివరాలను పంచుకోవడాన్ని నిషేధిస్తూ ట్విటర్‌ నిబంధనలు రూపొందించింది. వీటినే డాక్సింగ్‌ రూల్స్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘నిరంతరం నన్ను విమర్శించడం వరకు ఫరవాలేదు. నా నిరంతర కదలికల్ని తెలుసుకుంటూ వాటిని బహిర్గతం చేసి నా కుటుంబానికి ముప్పు తెచ్చిపెట్టడం ఏ మాత్రం సరికాదు’’ అని మస్క్‌ ట్వీట్‌ చేశారు.  వీటిపై ఏడు రోజుల వరకు ఈ సస్పెన్షన్‌ కొనసాగుతందన్నారు. అయితే, ట్విటర్‌ మాత్రం ఖాతాలను సస్పెండ్‌ చేయడంపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. 

మస్క్‌ (Elon Musk) ప్రైవేట్‌ జెట్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తున్న ‘ఎలాన్‌జెట్‌’ పేరిట ఉన్న ఖాతాను సైతం ట్విటర్‌ గురువారం సస్పెండ్‌ చేసింది. ఈ పరిణామాలపై న్యూయార్క్‌ టైమ్స్‌ స్పందించింది. ‘‘ప్రముఖ పాత్రికేయుల ట్విటర్‌ ఖాతాలను సస్పెండ్‌ చేయడం ప్రశ్నార్థకం. దురదృష్టకరం. దీనికిగల కారణమేంటో ట్విటర్‌ తెలియజేయలేదు. సస్పెన్షన్‌కు గురైన జర్నలిస్టుల ఖాతాలన్నింటినీ పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాం’’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రతినిధి తెలిపారు. ట్విటర్‌కు పోటీగా వచ్చిన మాస్టోడాన్‌ ఖాతాపై చర్యలు తీసుకొంది. ట్విటర్‌ను మస్క్‌ సొంతం చేసుకున్న తర్వాత ఈ కొత్త సామాజిక మాధ్యమాన్ని కొంతమంది ఔత్సాహికులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

వాక్‌ స్వాతంత్ర్యాన్ని రక్షించడానికే తాను ట్విటర్‌ను కొనుగోలు చేశానని మస్క్‌ (Elon Musk) పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అన్ని అంశాలపై స్వేచ్ఛాయుత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి ట్విటర్‌ను సరైన వేదికగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో పూర్వ ట్విటర్‌ యాజమాన్యం రద్దు చేసిన ఖాతాలను సైతం పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు చేసిన పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాజాగా సస్పెండ్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు