Elon Musk: ట్విటర్‌ మాజీ ఉద్యోగికి.. దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చిన మస్క్‌

ట్విటర్‌ యాడ్స్‌ మాజీ హెడ్‌ బ్రూస్‌ ఫ్లాక్‌ (Bruce Falck)కు ఆ సంస్థ సీఈవో మస్క్‌ (Elon Musk) తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. ఓ వైపు క్షమాపణలు చెబుతూనే అతడి పనితనాన్ని ఎత్తి చూపారు.

Published : 18 Feb 2023 23:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌ ప్రకటనల (Twitter Ads) విభాగం మాజీ అధిపతి బ్రూస్‌ ఫ్లాక్‌ (Bruce Falck) వ్యాఖ్యలపై ఆ సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఘాటుగా సమాధానమిచ్చారు. ‘మస్క్‌ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు’ అంటూ బ్రూస్‌ఫ్లాక్‌ విమర్శించడంపై తనదైన శైలిలో స్పందించారు. ‘‘ నన్ను క్షమించాలి. మీరు చాలా మేధావి. అందుకే ట్విటర్‌ యాడ్స్‌ అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది. ట్విటర్‌లో ప్రకటనలు చూసి దాదాపు ఎవరూ ఏమీ కొనడం లేదు. ఏదైనా కొనుగోలు చేయాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రకటనలు చూస్తున్నారు.’’ అని ట్విటర్‌లో పోస్టు చేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎలాన్‌ మస్క్‌ యూజర్లకు క్షమాపణలు చెబుతూ శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ ట్విటర్‌లో మీకు చాలా అసంబద్ధమైన, బాధించే ప్రకటనలు చూపుతున్నందుకు క్షమించండి. దీనిని సరి చేసేందుకు వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకుంటాం.’’ అని పోస్టు చేశారు. దీనిపై బ్రూస్‌ ఫ్లాక్‌ స్పందిస్తూ.. ‘మస్క్‌ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ట్విటర్‌ యాడ్స్‌ మాజీ హెడ్‌గా కచ్చితంగా చెప్పగలను’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై తాజాగా ఎలాన్‌ మస్క్‌ బ్రూస్‌ ఫ్లాక్‌కి కౌంటర్‌ ఇచ్చారు.

అధిక ధరలు చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే వారికి ఎలాంటి ప్రకటనలు కనిపించబోవని, ఇది కొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తుందని మస్క్‌ గతంలోనే ప్రకటించారు. తనను గానీ, తన విధానాలను గానీ ఎవరు విమర్శించినా వారికి కౌంటర్‌ ఇవ్వడంలో మస్క్‌ ముందుంటారు. ఇటీవల తన ట్వీట్లకు పెద్దగా ఆదరణ దక్కడం లేదని గుర్రుగా ఉన్నట్లు, ఈ మేరకు తన ట్వీట్లకు ప్రాధాన్యం దక్కేలా కోడింగ్‌, అల్గారిథమ్‌లో మార్పులు చేయాలని ఇంజినీర్లను కోరినట్లు ఓ వెబ్‌సైట్‌ రాసుకొచ్చింది. ఈ వార్తలను కూడా ఎలాన్‌ మస్క్‌ ఖండించారు. అలాంటిదేమీ లేదని ట్విటర్‌ వేదికగా రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు